Aakash Chopra warns Yashasvi Jaiswal ahead of IND vs SA 2nd Test
IND vs SA : గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం (నవంబర్ 22) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా పలు సూచనలు చేశాడు. తొలి టెస్టులో విఫలమైన జైస్వాల్ రెండో టెస్టు మ్యాచ్‌లో తన అహాన్ని (ఈగో)ని పక్కన పెట్టి ఆడాలన్నాడు. అదే సమయంలో ఎడమ చేతి వాటం పేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడాలని సలహా ఇచ్చాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ ఘోరంగా విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగలు చేసిన ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. కాగా.. ఈ రెండు సందర్భాల్లో కూడా అతడు ఎడమచేతి వాటం పేసర్ అయిన మార్కో జాన్సెన్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ క్రమంలో రెండో టెస్టులో రాణించేందుకు జైస్వాల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ల బలహీనతను అధిగమించేందుకు అతడు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆధ్వర్యంలో చెమటోడ్చుతున్నాడు. ఈ నేపథ్యంలోనే జైస్వాల్‌ను ఉద్దేశించి ఆకాశ్ చోప్రా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
జైశ్వాల్ తన అహాన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా ఆడాలన్నాడు. సాధారణంగా జైస్వాల్ దూకుడుగా ఆడుతూ అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ఉంటాడు. కొన్ని సార్లు దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోతూ ఉంటాడు. తొలి టెస్టులోనూ ఇలాగే జరిగింది. అతడు ఎడమ చేతి వాటం పేసర్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యం మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అతడు తడబడుతున్నాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను కాస్త చూసి ఆడాలి అని చోప్రా అన్నాడు.
ఇక గౌహతిలో రెండో టెస్టు మ్యాచ్ ఆడడం జైస్వాల్‌కు కాస్త కలిసి వచ్చే అంశం అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు గౌహతిలోని బర్సపారా స్టేడియం హోం గ్రౌండ్‌గా ఉందన్నాడు. ఐపీఎల్‌లో ఆర్ఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జైస్వాల్ ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడాడు. దీంతో ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులపై అతడికి పూర్తి అవగాహన ఉంటుందన్నాడు.
World boxing cup 2025 : తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఖాతాలో మరో స్వర్ణం
జాన్సెన్ బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగకుండా కాస్త చూసి ఆడాలి. లేకుంటే మరోసారి అతడికే వికెట్ సమర్పించుకోవాల్సి ఉంటుందని చోప్రా తెలిపాడు.