IPL: అప్పట్లో నాకు అనవసరంగా ఎక్కువ డబ్బులిచ్చారు: ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు

ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్‌ను గెలుచుకుంది.

పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.. అభిమానుల కల నిజమైంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 2025 ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించి తమ మొట్టమొదటి టైటిల్‌ను ముద్దాడింది. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు సైతం సాధించలేని ఈ కలను కొత్త జట్టు చేసి చూపించింది. ఈ చారిత్రక విజయాన్ని వీక్షించడానికి మ్యాచు జరుగుతున్న సమయంలో గేల్, డివిలియర్స్ స్టేడియానికి వచ్చారు.

అయితే, ఈ సంబరాల మధ్య ఏబీ డివిలియర్స్ చేసిన ఓ షాకింగ్ కామెంట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ రహస్యాన్ని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ బయటపెట్టారు.

“నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏబీ డివిలియర్స్ పక్కనే కూర్చున్నాను. అప్పుడు ఆయన నాతో ఒక్క మాట అన్నారు. అది విని నేను ఆశ్చర్యపోయాను” అని తెలిపారు.

ఇంతకీ ఆ సమయంలో ఏబీ డివిలియర్స్ ఏమన్నారంటే… “నిజం చెప్పాలంటే, నాకు అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లించారనిపిస్తోంది. ఆ డబ్బుతో RCB యాజమాన్యం మరింత మంది మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేయగలిగేది. ఈసారి వాళ్లు అదే చేశారు. ఫిల్ సాల్ట్, జోష్ హాజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లకే ఎక్కువ ఖర్చుపెట్టారు. అయినా ఎవరికీ రూ.15 కోట్లు దాటనివ్వలేదు” అన్నారు. ఈ విషయాన్ని ముకుంద్ చెప్పారు.

Also Read: ఈ సారి విశ్వ శాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు… ప్రత్యేకతలు ఏంటంటే?

ఈసారి RCB ఆ తప్పు చేయలేదు

గతంలో డివిలియర్స్ (2018లో రూ.11 కోట్లు), కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లపై భారీగా ఖర్చుపెట్టిన RCB, ఈసారి తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఈసారి మెగా వేలంలో ఏ ఒక్క ఆటగాడిపైనా రూ.12.5 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. (విరాట్ కోహ్లీని మాత్రం రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది). ఏదో ఒక స్టార్ ఆటగాడిపై ఆధారపడకుండా మ్యాచ్‌లను గెలిపించే బలమైన జట్టు ఉండేలా చూసుకుంది.

వెంకటేశ్ అయ్యర్ కోసం KKRతో చివరి వరకు పోటీపడి, రూ.23.50 కోట్ల వరకు వెళ్లింది. కానీ చివరికి KKR అతన్ని రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. ఇదే RCBకి కలిసొచ్చింది! ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.

అయ్యర్‌పై పెట్టాల్సిన ఆ డబ్బును ఆదా చేసుకోవడం వల్లే RCB.. జోష్ హాజిల్‌వుడ్, జితేశ్ శర్మ, ఫిల్ సాల్ట్ వంటి మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేయగలిగింది. ఆ తర్వాత తక్కువ ధరకే భువనేశ్వర్ కుమార్‌ను కూడా జట్టులోకి తెచ్చుకుంది. ఈ నలుగురు ఆటగాళ్లు ఫైనల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

వ్యూహం మార్చారు.. చరిత్ర సృష్టించారు

ఒక్కరిపై కోట్ల రూపాయలు కుమ్మరించే పాత పద్ధతిని వదిలి, ఒక సమతుల్యమైన జట్టు కోసం వేసుకున్న కొత్త వ్యూహమే RCBకి 18 ఏళ్ల కలను సాకారం చేసింది. ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్‌ను గెలుచుకుంది.