Abhishek Sharma Gets Motivational Tattoo On Right Hand
Abhishek Sharma : ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు అభిషేక్ శర్మ. తనదైన శైలిలో బంతిని బాదుతూ భారత జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ తన చేతిపై ఓ కొత్త టాటూ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అభిషేక్ శర్మ.. తన కుడి చేతి మణికట్టుపై ‘ఇట్ విల్ హ్యాపెన్’ అని టాటూగా వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోస్ట్ చేసిన 10 గంటల్లోనే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి.
76 పాయింట్ల ఆధిక్యంలో..
పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఖాతాలో 925 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న ఫిల్ సాల్ట్ కంటే 76 పాయింట్ల ఆధిక్యంలో అతడు ఉన్నాడు. ఇక మూడో స్థానంలో హైదరాబాదీ కుర్రాడు తిలక్ శర్మ ఉండగా.. అభిషేక్ ఇతడి కంటే 137 రేటింగ్ పాయింట్లు ముందంజలో ఉన్నాడు.
గత కొంత కాలంగా అభిషేక్ శర్మ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్ 2025ను భారత జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక అయ్యాడు.
ఆ తరువాత ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ లోనూ అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.