Asia Cup 2023 : క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌ కృషికి భారీ నజరానా

ఆసియా క‌ప్ 2023 ముగిసింది. భార‌త జ‌ట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంక‌ను ఓడించి క‌ప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజ‌యవంతం చేయ‌డంలో క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు కృషి ఎంత‌గానో ఉంది.

Asia Cup : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎద‌రుచూసిన ఆసియా క‌ప్ (Asia Cup) 2023 ముగిసింది. భార‌త జ‌ట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంక‌ను ఓడించి క‌ప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజ‌యవంతం చేయ‌డంలో క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌ కృషి ఎంత‌గానో ఉంది. చాలా మ్యాచుల‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. ఆ స‌మ‌యంలో గ్రౌండ్స్‌మెన్ మైదానం మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్ప‌డంతో పాటు వ‌ర్షం నీటిని తొల‌గించి మైదానాల‌ను మ్యాచ్‌ల‌కు సిద్ధం చేశారు.

వీరి కృషిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), శ్రీలంక క్రికెట్ (SLC) గుర్తించాయి. కొలంబో, క్యాండీ క్రికెట్‌ మైదానాల్లో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్ ల‌కు 50వేల యూఎస్ డాల‌ర్ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు బీసీసీఐ కార్య‌ద‌ర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు జైషా (Jay Shah) తెలిపారు. వారి నిబ‌ద్ధ‌త‌, కృషి వ‌ల్లే ఆసియా క‌ప్ 2023 మ‌రుపురాని దృశ్యంగా మారింద‌న్నారు. వీరు అన్‌సంగ్ హీరోస్ ఆఫ్ క్రికెట్ అంటూ జైషా ట్వీట్ చేశారు.

కొలంబో వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జ‌ట్టు 15.2 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. కుశాల్ మెండీస్ (17), దుషన్ హేమంత (13) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్ సాధించారు. మిగిలిన వారు ఘోరంగా విప‌లం కావ‌డంతో త‌క్కువ ప‌రుగుల‌కే లంక ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆరు వికెట్లతో లంక ప‌త‌నాన్ని శాసించ‌గా హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఓ వికెట్ తీశారు.

IND vs SL : ఆసియా క‌ప్ విజేత భార‌త్‌.. రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన టీమ్ఇండియా

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ 6.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్ (23), శుభ్‌మ‌న్ గిల్ (27) మ‌రో బ్యాట‌ర్‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా 10 వికెట్ల తేడాతో భార‌త్‌కు ఘ‌న విజ‌యాన్ని అందించారు. భార‌త్‌కు ఇది ఎనిమిదో ఆసియా క‌ప్పు. 1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018, 2023 సీజ‌న్ల‌లో భార‌త్ ఆసియా క‌ప్పును గెలుచుకుంది.

ట్రెండింగ్ వార్తలు