Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు..

Rashid Khan Creates History : బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Rashid Khan

Rashid Khan Creates History : ఆసియా కప్ -2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా గ్రూప్-ఎ నుంచి బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గాన్ జట్టుపై విజయం సాధించింది.

Also Read: Betting App Case : మాజీ క్రికెట‌ర్లు యువ‌రాజ్ సింగ్‌, ఉత‌ప్పల‌తో పాటు న‌టుడు సోనూసూద్‌కు ఈడీ స‌మ‌న్లు

ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

బంగ్లాదేశ్ జట్టుపై రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగిఉన్న రషీద్.. టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కూడా అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. ఆరు మ్యాచ్‌లలో 13 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన భువనేశ్వర్ కుమార్ రికార్డును రషీద్ ఖాన్ బద్దలు కొట్టాడు. రషీద్ ప్రస్తుతం 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు.

టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు..
♦ రషీద్ ఖాన్ – 14 వికెట్లు
♦ భువనేశ్వర్ కుమార్ – 13 వికెట్లు
♦ వానిండు హసరంగా – 12 వికెట్లు
♦ అమ్జాద్ జావేద్ – 12 వికెట్లు
♦ హార్దిక్ పాండ్యా – 12 వికెట్లు

రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో 650కిపైగా వికెట్లు తీయడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 700 వికెట్ల రికార్డుకు చేరుకోవటానికి కేవలం 30 వికెట్ల దూరంలో రషీద్ ఖాన్ ఉన్నాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో రషీద్ 171 వికెట్లు పడగొట్టాడు. ఇవి.. ప్రపంచంలో ఏ ఆటగాడికి లేని అత్యధిక వికెట్లు. టీ20, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో రషీద్ ఎకానమీ ఏడు కంటే తక్కువ.. ఇది అతను ప్రపంచంలోనే గొప్ప టీ20 స్పిన్నర్ అనడంలో సందేహం లేదు.