Virat Kohli-Anushka Sharma
Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఈ రోజు. నేడు 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మెగా టోర్నీలో విరాట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును సమం చేయొచ్చు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు నాడు శతకం చేసి సచిన్ రికార్డును అందుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి అతడి సతీమణి అనుష్క శర్మ పై పడింది. కోహ్లీ పుట్టిన రోజు నాడు అనుష్క చేసిన ట్వీటే అందుకు కారణం. విరాట్ కెరీర్, తమ అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది. ”అతడు తన జీవితంలోని ప్రతి పాత్రలో అసాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతడి ప్రయాణంలో నేను ఓ భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ జీవితాంతం, ఆ తరువాత కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తాను.” అంటూ అనుష్క రాసుకొచ్చింది.
బాల్ వేయకుండానే వికెట్..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అంటూ అనుష్క ఓ పోస్ట్ చేసింది. 2011లో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచులో మొదటి సారి బౌలింగ్ చేశాడు. కెవిన్ పీటర్సన్‌ను ఔట్ చేశాడు. కోహ్లీ బాల్ వేయగా అది వైడ్‌గా వెళ్లింది. పీటర్సన్ క్రీజు వదిలి ముందుకు వచ్చి ఆడాడు. బంతి అందుకున్న ధోని మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు. దీంతో బాల్ వేయకుండా వికెట్ సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
2017 డిసెంబర్ 11న విరాట్, అనుష్క శర్మ లు పెళ్లి చేసుకున్నారు. 2021 జనవరి 11న ఈ జంటకు వామిక జన్మించింది.