Nathan Lyon ruled out Ashes
Nathan Lyon ruled out Ashes : ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్‌లో వరుస విజయాలతో ఆస్ట్రేలియా పుల్ జోష్‌లో ఉంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌కు గట్టి షాక్ తగిలింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ (Nathan Lyon ) గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మిగతా మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం లేడని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) అధికారికంగా ప్రకటించింది. వరుసగా వంద టెస్టులు ఆడిన లైయన్ తొలిసారి గాయంతో తప్పుకున్నాడు. కాగా.. లైయన్ లేని లోటును భర్తీ చేయడం ఆసీస్ కు అంత సులువు కాదు. ఇప్పటి వరకు అయితే అతడి స్థానంలో ఎవ్వరిని ఎంపిక చేయలేదు.
రెండో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో నాథన్ లైయన్ కాలు బెణికింది. ఫిజియో సాయంతో గ్రౌండ్ ను వీడాడు. మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న లైయన్ రెండో ఇన్సింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. అయితే.. జట్టు విజయం కోసం కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చాడు. జట్టు కోసం ఓ బౌండరీ కొట్టి నాలుగు పరుగులు చేసి ఔటైయ్యాడు. అతడు బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో, ఔటై వెళ్లి పోతున్న సమయంలోనూ స్టేడియంలోని ప్రేక్షకులు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. బ్యాటింగ్ కు వెళ్తే రిస్క్ అని మెడికల్ టీమ్ చెప్పినప్పటికీ జట్టు కోసం ఏదైనా చేస్తానని లైయన్ చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది. స్టోక్స్(155) అద్భుతంగా పోరాడినప్పటికీ 327 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.