×
Ad

Asia Cup 2025: ఫైనల్ కి దూసుకెళ్లిన భారత్.. బంగ్లాపై ఘన విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

Courtesy @ ESPNCricInfo

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది. సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ భారత్ ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ టోర్నీలో ఫైనల్ కి చేరింది టీమిండియా. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

169 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా.. 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. బంగ్లా బ్యాటర్లలో సైఫ్ హస్సన్ వన్ మ్యాన్ షో చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బంతుల్లో 69 రన్స్ చేశాడు.

భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. మరో ఎండ్ లో గిల్ 29 రన్స్ తో రాణించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడారు. ఒకానొక దశలో స్కోర్ 200 దాటేలా అనిపించింది. అయితే వీరిద్దరూ ఔటయ్యాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో రన్స్ వేగం తగ్గింది. చివరలో హార్ధిక్ పాండ్య ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లో 38 రన్స్ స్కోర్ చేశాడు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేస్ 2 వికెట్లు తీశాడు. సకీబ్, రెహ్మాన్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.

భారత్ గెలుపుతో ఈ టోర్నీ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ కి వెళ్లేందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు అవకాశాలు ఉన్నాయి. పాక్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ చేరనున్నారు.