×
Ad

Abhishek Sharma : బంగ్లాదేశ్‌ను చిత‌క్కొట్ట‌డానికి కార‌ణం అదే.. అభిషేక్ శ‌ర్మ కామెంట్స్‌..

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) త‌న బ్యాటింగ్ శైలి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Asia Cup 2025 Abhishek Sharma comments after team india win against Bangladesh

Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాక‌ప్ 2025 టోర్నీలోనూ త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. బుధ‌వారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 6 ఫోర్లు, 5 సిక్స‌ర్ల సాయంతో 75 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ 41 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించడంతో అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ అవార్డు అందుకున్న త‌రువాత అభిషేక్ మాట్లాడాడు. టీ20 క్రికెట్‌లో త‌న దూకుడైన బ్యాటింగ్‌కు గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించాడు. త‌న రేంజ్‌లో ఉంటే మొద‌టి బంతిని కూడా సిక్స‌ర్‌ కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌కు దూకుడుగా ఆడ‌డం ఇష్టం అని చెప్పాడు. ఇందుకోసం నెట్స్‌లో గంట‌ల కొద్ది ప్రాక్టీస్ చేస్తాన‌ని తెలిపాడు.

Jaker Ali : అందుకే భార‌త్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్‌..

‘నా జ‌ట్టుకు కావాల్సిన ప‌నిని పూర్తి చేశాను. నేను ఇంత‌కు ముందే చెప్పాను. నేను ఓ ప్లో ప్ర‌కారం ఆడ‌తాను. నా ప‌రిధిలో ఉంటే తొలి బంతిని కూడా సిక్స్ కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తా. ప‌వ‌ర్ ప్లేలో జ‌ట్టుకు మంచి స్కోరు అందించ‌డ‌మే ల‌క్ష్యం.’ అని అభిషేక్ తెలిపాడు.

ఫీల్డ‌ర్ల‌ను బ‌ట్టి షాట్లు ఆడ‌తా..

గ‌త మ్యాచ్‌లో త‌న వికెట్ తీసేందుకు ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు ప్ర‌య‌త్నించార‌ని, అందుక‌నే తొలి బంతి నుంచే తాను దూకుడుగా ఆడిన‌ట్లు అభిషేక్ వెల్ల‌డించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో పిచ్ కొత్త‌ది కావ‌డంతో తొలుత ఆచితూచి ఆడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలిపాడు. తాను ఎప్పుడూ ఫీల్డ్ బ‌ట్టి షాట్లు కొడ‌తాన‌ని తెలిపాడు.

ఇందు కోసం తాను ప్రాక్టీస్ సెష‌న్‌లో ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేస్తుంటాన‌ని తెలిపాడు. బ్యాట‌ర్ల‌కు నెట్స్‌లో ఎక్కువ బంతులు ఆడే స‌మ‌యం దొరుకుతుంద‌న్నాడు. నెట్స్‌లో షాట్లు ఆడే స‌మ‌యంలో ఔట్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని, ఈ క్ర‌మంలో తాను ఔట్ అవ్వ‌కుండా ప్రాక్టీస్ చేస్తుంటాన‌ని అభిషేక్ తెలిపాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. అభిషేక్ శ‌ర్మ (37 బంతుల్లో 75 ప‌రుగులు) విధ్వంసానికి తోడు హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38 ప‌రుగులు), శుభ్‌మ‌న్ గిల్ (19 బంతుల్లో 29 ప‌రుగులు) లు రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. బంగ్లా బౌల‌ర్ల‌లో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Suryakumar Yadav : దూబెను మూడో స్థానంలో ఆడించ‌డం పై సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌.. ఏదో అనుకున్నాం.. కానీ..

అనంత‌రం సైఫ్ హసన్ (69; 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి కూడా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో బంగ్లాదేశ్ 19.3 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, వ‌రున్ చ‌క్ర‌వ‌ర్తిలు చెరో రెండు వికెట్లు తీశారు. అక్ష‌ర్ ప‌టేల్‌, తిల‌క్ వ‌ర్మ‌లు చెరో వికెట్ సాధించారు.