Asia Cup 2025 Pakistan Can Still Qualify For Final after lost match to india in super 4
Asia Cup 2025 : ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి. సూపర్-4 స్టేజీని అన్ని జట్లు కూడా సున్నా పాయింట్లతో మొదలు పెడతాయి అన్న సంగతి తెలిసిందే. దీంతో సూపర్-4లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి రెండు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు శ్రీలంక పై గెలిచిన బంగ్లాదేశ్ ఖాతాలో కూడా రెండు పాయింట్లు ఉన్నప్పటికి.. భారత్ (+0.689)కంటే రన్‌రేటు (+0.121)తక్కువగా ఉండడంతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక ఆడిన ఒక్కొ మ్యాచ్‌లో ఒడిపోయిన శ్రీలంక(-0.121), పాక్ (-0.689) జట్లు వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
భారత్ Asia Cup 2025 ఫైనల్‌కు చేరుకోవాలంటే..?
ఆసియాకప్ 2025 నిబంధనల ప్రకారం.. సూపర్-4లో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్ సూపర్ -4 స్టేజీలో మరో రెండు మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్‌కు దూసుకువెలుతుంది. కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ గెలిచిన కూడా ఫైనల్ రేసులో భారత్ ఉంటుంది. అప్పుడు మిగిలిన జట్ల సమీకరణాలు ముఖ్యంగా నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఇంకా పాక్‌కు ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉందా?
భారత్ చేతిలో ఓడిపోయినప్పటికి కూడా పాక్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఇంకా మిగిలి ఉంది. ఆ జట్టు సూపర్-4లో మరో రెండు మ్యాచ్‌లు శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అప్పుడే ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా శ్రీలంక పై ఓడి, బంగ్లాదేశ్ పై గెలిచినా ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. అప్పుడు భారత్.. లంక, బంగ్లాదేశ్ పై గెలవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. అప్పుడు లంక, పాక్, బంగ్లాదేశ్‌లు ఒక్కొ మ్యాచ్‌లో విజయం సాధించి తలా రెండు పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్‌రేటు కలిగిన జట్టు భారత్‌తో పాటు ఫైనల్‌కు చేరుకుంటుంది.