Asia Cup Trophy Row BCCI Fresh Warning To Mohsin Naqvi Over
BCCI : ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచి 20 రోజులు దాటిపోయింది. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు భారత జట్టు ట్రోఫీని అందుకోలేదు. అదే విధంగా ఆటగాళ్లకు మెడల్స్ కూడా అందలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏసీసీ చీఫ్, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆగ్రహించిన నఖ్వీ.. ఆసియాకప్ ట్రోఫీతో పాటు మెడల్స్‌ను తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆసియా క్రికెట్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయినప్పటికి కూడా నఖ్వీ ట్రోఫీ ఇవ్వలేదు. ఏసీసీ కార్యాలయంలో భారత్‌కు ట్రోఫీ అందజేస్తానని చెప్పాడు. దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ మంత్రిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోపీని తీసుకునేది లేదని చెప్పింది.
దీంతో తన అనుమతి లేకుండా దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉన్న ట్రోఫీ, మెడల్స్‌ను అక్కడి నుంచి తరలించడం లేదా ఇతరులకు అప్పగించడం చేయవద్దని నఖ్వీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలు ఇలా..
తాజాగా ఈ విషయంలో నఖ్వీకి బీసీసీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని సరైన పద్దతిలో అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. ఈ మేరకు నఖ్వీకి ఓ మెయిల్ పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. నఖ్వీ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పాడు. స్పందన రాకుంటే అధికారిక మెయిల్ ద్వారా ఐసీసీకి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామని చెప్పాడు. ట్రోఫీని భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.