AUS vs ENG 1st Test Australia won by 8 wickets
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ (AUS vs ENG ) ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 28.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (123; 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. టెస్టుల్లో టీ20ని తలపించేలా బ్యాటింగ్ చేశాడు. అతడికి మార్నస్ లబుషేన్ (51 నాటౌట్; 49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), జేక్ వెదరాల్డ్ (23)లు చక్కని సహకారం అందించారు.
రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెన్నునొప్పితో బాధపడుతుండడంతో 205 పరుగుల లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా వచ్చాడు. అతడు ఆరంభం నుంచి ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీల మోత మోగించాడు. 36 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్న హెడ్ 69 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. అంటే అతడు ఎంత వేగంగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 123/9తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 132 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యం నిలవగా ట్రావిస్ హెడ్ ఊచకోత కోయడంతో ఆసీస్ విజయాన్ని అందుకుంది.