Australia Star Allrounder Marcus Stoinis retires from ODI cricket
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఇప్పటికే అన్ని దేశాలు ప్రకటించాయి. అయితే.. ఈ మెగాటోర్నీ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ జట్టుకు దూరం అయ్యాడు. మరోవైపు కెప్టెన్ పాట్ కమిన్స్ ఆడడం పైనా అనుమానాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ జట్టులో మార్కస్ స్టోయినిస్ చోటు దక్కించుకున్నాడు. అయితే.. ఇప్పుడు వన్డేలకు వీడ్కోలు పలకడంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడు. జట్టులో చోటు దక్కినప్పటికి స్టోయినిస్ సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వీడ్కోలు పలికినా బాగుండేదని పలువురు ఆసీస్ అభిమానులు అంటున్నారు. జట్టులో ఏదో జరుగుతుందని కొందరు అంటున్నారు.
MARCUS STOINIS HAS ANNOUNCED HIS RETIREMENT FROM ODIS.
– Thank you, Hulk…!!! 💪 pic.twitter.com/r8QWeGuAoT
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025
దేశం తరుపున ఆడడాన్ని గౌరవంగా భావిస్తాను అని మార్కస్ స్టోయినిస్ అన్నాడు. తాను తీసుకున్న నిర్ణయం అంత సులభం కాదన్నాడు. తాను సరైన సమయంలోనే వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కోచ్ మెక్‌డొనాల్డ్ తనకు ఎంతో సపోర్టు చేశాడన్నారు.
35 ఏళ్ల మార్కస్ స్టోయినిస్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన కెరీర్ లో 71 వన్డేలు ఆడాడు. 26.7 సగటుతో 1495 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 6 అర్థశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 48 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తరపున స్టోయినిస్ తన చివరి వన్డే మ్యాచ్ ను పాక్ పై ఆడాడు. ఆ మ్యాచ్ లో కేవలం 8 పరుగులే చేశాడు.
Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. మార్కస్ స్టోయినిస్ రిటైర్‌మెంట్ నేపథ్యంలో అతడి స్థానంలో మరో ఆటగాడిని ఆసీస్ ఎంపిక చేయనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్ ( మరో కొత్త ఆటగాడు ఇతడి స్థానంలో రానున్నాడు).