Harshit Rana : ఏందిదీ రాణా.. మొన్న టీ20 అరంగ్రేటంలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన.. నేడు వన్డే అరంగ్రేటంలో చెత్త రికార్డు..
నాగ్‌పూర్ ద్వారా వన్డేల్లో హర్షిత్ రాణా అరంగ్రేటం చేశాడు.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత యువ ఆటగాళ్లు వన్డేల్లో అరంగ్రేటం చేశారు. వాళ్లే యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణాలు. వీరిద్దరిలో ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా టీ20ల్లో అనూహ్యంగా అరంగ్రేటం చేశాడు హర్షిత్ రాణా. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె కంకషన్ గురి కావడంతో అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా హర్షిత్ ఆడాడు. నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ ను తీసుకోవాలని గంభీర్ భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో అతడిని ఆడిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా హర్షిత్ వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. అయితే.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను హర్షిత్ వేశాడు. ఈ ఓవర్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ దంచికొట్టాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. 6, 4, 6, 4, 0, 6 బాది ఈ ఓవర్‌లో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అరంగ్రేట మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును హర్షిత్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ప్రస్తుతం 10 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 77/3. హ్యారీ బ్రూక్ (0), జో రూట్ (1) లు క్రీజులో ఉన్నారు.
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
ICC T20 Ranking: అటు తిలక్ వర్మకు షాకిచ్చిన అభిషేక్ శర్మ.. ఇటు రెండో స్థానంలోకి దూసుకొచ్చిన..
ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డెకట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెత్ వెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ , సకిబ్ మహమూద్.