ICC T20 Ranking: అటు తిలక్ వర్మకు షాకిచ్చిన అభిషేక్ శర్మ.. ఇటు రెండో స్థానంలోకి దూసుకొచ్చిన..

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ICC T20 Ranking: అటు తిలక్ వర్మకు షాకిచ్చిన అభిషేక్ శర్మ.. ఇటు రెండో స్థానంలోకి దూసుకొచ్చిన..

Varun Chakaravarthy Abhishek Sharma

Updated On : February 6, 2025 / 9:38 AM IST

Team India T20 Ranking: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉండగా.. ఏకంగా 13 సిక్సులు కొట్టాడు. మరో విశేషం ఏమిటంటే అభిషేక్ శర్మ ఎడాపెడా సిక్సులు బాదుతూ కేవలం 17 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ, 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో భారత తరపున అత్యధిక సిక్సులు, అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Also Read: Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌?

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో అభిషేక్ శర్మ 279 పరుగులు చేశాడు. అందులో 24 ఫోర్లు, 22 సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రాకెట్ వేగంతో దూసుకొచ్చి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ రెండో స్థానంను దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కంటే ముందు అభిషేక్ ర్యాంకింగ్ 40గా ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించడంతో అతను ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో రెండో స్థానంలో కొనసాగుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మను అభిషేక్ శర్మ వెనక్కు నెట్టేశాడు. తిలక్ వర్మ ఒక స్థానం పడిపోయి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో, యశస్వీ జైశ్వాల్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఉన్నాడు.

 

మరోవైపు ఇంగ్లాండ్ పై టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భతంగా రాణించాడు. తన మ్యాజిక్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ప్రధాన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోకుండా చేశాడు. ఈ క్రమంలో ఈ సిరీస్ లో వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు మెరుగై ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తో కలిసి వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రవి బిష్ణోయ్ ఆరో స్థానంలో నిలిచాడు.

టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో జస్ర్పీత్ బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టెస్టు బ్యాటింగ్ విభాగంలో యశస్వీ జైశ్వాల్ నాల్గో స్థానంలో కొనసాగుతుండగా.. రిషబ్ పంత్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో బ్యాటింగ్ విషయానికి వస్తే.. టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకింగ్స్ లో కొనసాగుతున్నారు. వన్డే బౌలింగ్ విభాగంలో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.