Australia star batter Travis Head may miss boxing day test due to injury
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ ఇందుకు వేదిక కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి.
అయితే.. నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గాయంతో బాధపడుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోలేదని, దీంతో అతడు నాలుగో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుతూ కనిపించాడు. ఇక టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అతడు ఫీల్డింగ్ కు రాలేదు. అతడు తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లుగా సమాచారం.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. అతడు నాలుగో టెస్టు కోసం ఆసీస్ జట్టు నిర్వహించిన ప్రాక్టీస్ సెష్పన్స్‌లో కనిపించలేదట. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు అతడికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారని, అందులో అతడు ఉత్తీర్ణుడు అయితే మ్యాచ్‌లో ఆడతాడని సదరు కథనం పేర్కొంది.
హెడ్ గాయం పై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు. ఫిట్‌నెస్ ఆందోళనను తోసిపుచ్చాడు. అయితే.. హెడ్ నాలుగో టెస్టు మ్యాచులో ఆడతాడో లేదో అనే విషయాన్ని మాత్రం 100 శాతం ధ్రువీకరించడం లేదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. మూడు టెస్టుల్లో 409 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న హెడ్ నాలుగో టెస్టుకు దూరం అయితే అది ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఈ సిరీస్‌లో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన హెడ్ నాలుగో టెస్టుకు దూరం అయితే మాత్రం టీమ్ఇండియా విజయావకాశాలు మరింత మెరుగు కానున్నాయి.
Sanju Samson : సంజూ శాంసన్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2025లో మారనున్న రోల్!
మరోవైపు గాయంతో జోష్ హేజిల్‌వుడ్ ఈ సిరీస్ మొత్తానికే దూరం అయిన సంగతి తెలిసిందే.