Ind vs Aus: మూడో టీ20 నేడే.. భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా?

  • Publish Date - December 8, 2020 / 07:47 AM IST

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత.. టీ20 సిరీస్‌లో మాత్రం రాణించి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచిన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు. చివరి మ్యాచ్‌లో గెలిచి ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆతిధ్య జట్టు మాత్రం ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది.



తొలి రెండు టీ20ల్లో భారత జట్టు అద్భుతంగా ఆడగా.. ఉత్కంఠభరితమైన రెండవ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత జట్టు ఉత్సాహంగా ఉంది. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో రెండు జట్ల మధ్య మూడో టీ20 జరగనుండగా.. భారత సమయం ప్రకారం మధ్యాహ్నం 1.40 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. టాస్ అరగంట ముందు 1:10కి జరుగుతుంది.



రెండు జట్ల మధ్య మూడవ టి 20 మ్యాచ్‌ను సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్(సోనీ సిక్స్, సోనీ టెన్ 1, సోనీ టెన్3) లో చూడవచ్చు. ఇది కాకుండా ఈ మ్యాచ్ డిడి స్పోర్ట్స్‌లో కూడా ప్రసారం అవుతుంది. సోనీలైవ్‌లో కూడా ఈ మ్యాచ్ చూడవచ్చు.



భారత్(Possible XI):
శిఖర్ ధావన్, KL రాహుల్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), సంజు సామ్సన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్, టి నటరాజన్ మరియు జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా(Possible XI):
మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆరోన్ ఫించ్(కెప్టెన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మొయిసెస్ హెన్రిక్స్, డేనియల్ శామ్స్, సీన్ అబోట్, నాథన్ లియోన్‌, ఆడమ్ జంపా మరియు ఆండ్రూ టై.



కెప్టెన్ విరాట్ కోహ్లీ తన విన్నింగ్ కాంబినేషన్‌ను కోనసాగించే అవకాశం ఉండగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశం ఉంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడానికి కెప్టెన్ కోహ్లీ ప్రయత్నం చేయవచ్చు. బుమ్రాతో పాటు టీ నటరాజన్, శార్దుల్ ఠాకూర్‌లు ఫాస్ట్ బౌలింగ్ చేయవచ్చు.



మరోవైపు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి రావచ్చు. రెండవ మ్యాచ్లో, కెప్టెన్ ఫించ్ కొన్ని సమస్యల కారణంగా ఆడలేదు. అతని స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు మాథ్యూ వేడ్ చేపట్టగా.. జట్టు నాథన్ లియోన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశం కనిపిస్తుంది.