ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం..

ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం..

Updated On : June 23, 2021 / 11:57 AM IST

మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న అత్యధిక సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును అందుకోవడానికి సెరెనా మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. 24 టైటిల్స్‌ను సమం చేయాలని తలంచిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. మెల్‌బౌర్న్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్) చేతిలో 6-4, 4-6, 7-5 పాయింట్ల తేడాతో 16వ సీడెడ్ ప్లేయర్ సెరెనా ఓటమిపాలైంది. అమ్మగా మారిన తర్వాత మళ్లీ టైటిల్స్ వేట ఆరంభించిన సెరెనాకు ఈ సారి కూడా నిరాశ తప్పలేదు.

2 గంటల 10 నిమిషాల పోరులో ఇద్దరూ హోరాహోరీగానే తలపడ్డారు. తొలి సెట్‌ మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ప్లిస్కోవా.. ఐదో గేమ్‌లో మరోసారి బ్రేక్‌ పాయింట్‌కు చేరువగా వెళ్లింది. అతి కష్టం మీద ప్లిస్కోవాను కాచుకున్న సెరెనా.. సెట్‌ను కాపాడుకోలేకపోయింది. రెండో సెట్లో వరుసగా ఒకరి సర్వీస్‌ ఒకరు బ్రేక్‌ చేసుకున్నారు. ఐతే పదో గేమ్‌లో సెరెనా బ్రేక్‌ సాధించి సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ రసవత్తరంగా సాగింది. 4, 6 గేముల్లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సెరెనా.. మ్యాచ్‌ను దాదాపు సొంతం చేసుకున్నట్లే కనిపించింది.

అయితే 1-5తో వెనుకబడిన ప్లిస్కోవా మనో నిబ్బరంతో గొప్పగా పోరాడింది. తర్వాతి గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. వెంటనే మరోసారి సెరెనా సర్వీస్‌ను కూడా ఆమె బ్రేక్‌ చేసింది. దీంతో 5-5తో స్కోరు సమమైంది. ఈ దశలో ప్లిస్కోవా మూడు మ్యాచ్‌ పాయింట్లు పోగొట్టుకోకుండా కాపాడుకోవడం విశేషం. వరుసగా మూడో గేమ్‌లోనూ బ్రేక్‌ సాధించిన ఆమె మ్యాచ్‌ విజయానికి చేరువైంది.  12వ గేమ్‌లో పెద్దగా కష్టపడకుండానే ఆమె సర్వీస్‌ నిలబెట్టుకుని 7-5 తేడాతో మ్యాచ్‌ను ఆమె సొంతం చేసుకుంది.

సెమీఫైనల్లో జపాన్ ప్లేయర్, 4వ సీడెడ్ నవోమి ఒకాసాతో ప్లిస్కోవా తలపడనుంది. కాగా వీరిద్దరికి ఇది తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్ కావడం గమనార్హం.