ICC World Cup 2023: భారత్‌తో మ్యాచ్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ హాట్ కామెంట్స్
ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని, అంతేగానీ, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని అన్నాడు. ఇంకా..

Babar Azam
ICC World Cup 2023 – Babar Azam: అవును.. భారత్‌తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ? అని అంటున్నాడు పాకిస్థాన్ కెప్టెన్ (Pakistan captain) బాబర్ అజాం. భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లో అక్టోబరు 15న ఇండియా-పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచు జరగనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఐసీసీ (ICC) మ్యాచుల షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచ కప్-2023 జరగనుంది. మొత్తం పది జట్లు మ్యాచులు ఆడతాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో బాబర్ అజాం మాట్లాడాడు. భారత్ తో జరిగే మ్యాచు కోసం తామేం ఆత్రుతగా ఎదురుచూడడం లేదని చెప్పాడు.
తాము ఆడే తొమ్మిది మ్యాచుల్లో భారత్ తో ఆడే మ్యాచు కూడా ఒకటని, అన్ని మ్యాచులకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని బాబర్ చెప్పుకొచ్చాడు. తాము ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని, అంతేగానీ, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని అన్నాడు. భారత్ కాకుండా మరో ఎనిమిది జట్లతోనూ తాము పోటీ పడాల్సి ఉందని చెప్పాడు. అన్ని జట్లపై ఆధిక్యత సాధిస్తేనే ఫైనల్ కు చేరుకుంటామని వ్యాఖ్యానించాడు.
భారత్ తో జరిగే మ్యాచ్ పైనే కాకుండా అన్ని జట్లపైనా దృష్టి సారించామని బాబర్ అన్నాడు. అన్ని జట్లపైనా బాగా ఆడి, గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఓ కెప్టెన్ గా తాను ఏ దేశంలో మ్యాచ్ ఆడినా ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించాలని, పాకిస్థాన్ ను గెలిపించాలని కోరుకుంటానని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇదే తీరుతో ఆడతామని అన్నాడు.