Bangladesh Cricket Team
Bangladesh T20 World Cup Boycott : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారతదేశంలో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లాదేశ్ టీమ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
భారత జట్టులో పర్యటించే సమయంలో జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా ఐసీసీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మొండిపట్టును వీడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టును టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో బరిలోకి దిగుతుందని ఐసీసీ పేర్కొంది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరం కావడం బంగ్లాదేశ్ జట్టుపై ఆర్థికపరంగా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే ఐదు లక్షల డాలర్లతోపాటు టోర్నీ స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయమూ దక్కదు. ప్రతీయేటా బీసీబీకి ఐసీసీ నుంచి రూ.247 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఐసీసీ నుంచి బీసీబీకి వచ్చే వార్షిక ఆదాయంలోనూ కోత పడుతుంది.
వీటన్నింటికి మించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు జరిగే పెద్దనష్టం ఏమిటంటే.. భారతదేశంతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోవడం. సమీప భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో భారత్ జట్టు పర్యటించే అవకాశం లేదు. ఆ జట్టునూ తమ దేశానికి రానివ్వదు. వేరే దేశంతో ద్వైపాక్షిక సిరీస్‌తో వచ్చే ఆదాయంతో పోలిస్తే భారతదేశంతో సిరీస్ ద్వారా పది రెట్లు ఎక్కువగా బీసీబీ ఆర్జిస్తుంది. దీన్నిబట్టి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోవడం వల్ల ఆ దేశం ఏ స్థాయిలో నష్టపోతుందో అంచనా వేయొచ్చు.