Bangladesh Players To Lose Sponsorship Report
Bangladesh cricketers : భారత్, బంగ్లాదేశ్ ల మధ్య క్రికెట్, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు షాక్ తగిలేలా ఉంది. బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న భారత సంస్థ ఎస్‌జీ తమ స్పాన్సర్ షిప్‌ను కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాళ్లు లిటన్ దాస్, మోమినుల్ హక్, యాసిర్ అలీ వంటి క్రికెటర్లకు ఎస్‌జీ స్సాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదనే ఎస్‌జీ తీసుకున్న నిర్ణయం గురించి ఇంకా ఆటగాళ్లకు అధికారికంగా తెలియజేయబడలేదు. కానీ వారి ఏజెంట్లు ఈ పరిణామం గురించి సూచనలు చేశారు. త్వరలోనే ఎస్‌జీ స్పాన్సర్‌గా వైదొలగొచ్చునని ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ ఓ ప్రముఖ వైబ్‌సైట్‌తో అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎస్‌జీ గనుక ఈ నిర్ణయం తీసుకుంటే మిగిలిన సంస్థలు కూడా అదే మార్గంలో నడిచే అవకాశాన్ని కొట్టి పారేయలేం అని సదరు క్రికెటర్ చెప్పినట్లుగా పేర్కొంది.
కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ క్రమంలో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్‌లో ఆడకుండా నిషేదం విధించాలనే డిమాండ్ల నేపథ్యంలో బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్ ను విడుదల చేసింది.
ఈ నిర్ణయం పై బంగ్లా ప్రభుత్వం అసహనాన్ని వ్యక్తం చేసింది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని, శ్రీలంకకు తమ జట్టు ఆడే మ్యాచ్‌లను తరలించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. కాగా.. బంగ్లా అభ్యర్థనపై ఐసీసీ ఇంత వరకు స్పందించలేదు.