Bangladesh Set to Replace Pakistan in Asia Cup 2025 hockey tournament Report
Asia Cup 2025 hockey tournament : పురుషుల ఆసియా కప్ 2025 హాకీ టోర్నమెంట్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. బీహార్‌లోని రాజ్‌గిరి ప్రాంతంలో ఈ టోర్నమెంట్ (Asia Cup 2025 hockey tournament) జరగనుంది. కాగా.. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనడం సందేహంగా మారింది. మరో రెండు రోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానుంది. ఒకవేళ పాక్ పాల్గొనక పోతే ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది.
రాబోయే రెండు రోజుల్లో పాకిస్తాన్ తన భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో విఫలమైతే బంగ్లాదేశ్ ప్రత్యామ్నాయ జట్టుగా అడుగుపెడుతుందని హాకీ ఇండియా ఉన్నతాధికారి పిటిఐకి తెలిపారు.
ఆసియా కప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేస్తామని ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. భద్రతా కారణాలను చూపెడతూ పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) భారత్‌కు వచ్చేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి నిర్వాహకులు ఇప్పటికే బంగ్లాదేశ్‌ను సంప్రదించారు
‘పాకిస్తానీ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉందని చెప్పింది. కానీ వారు (పాక్) భారతదేశానికి రాకూడదనుకుంటే.. అది మా సమస్య కాదు. పాకిస్తాన్ రాకపోతే బంగ్లాదేశ్‌ను పాల్గొనమని ఇప్పటికే ఆహ్వానించాం. కానీ నిర్ధారణ పొందడానికి మేము మరో రెండు రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.’ అని సదరు అధికారి తెలిపారు.
ఆసియా కప్ 2025 హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత్‌తో పాటు చైనా, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, ఒమన్, చైనీస్ తైపీ లు పాల్గొనున్నాయి. ఎనిమిదో జట్టుగా పాక్ లేదా బంగ్లాదేశ్ ఆడనుంది.