ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్: నెరవేరిన దశాబ్ధాల కల

  • Publish Date - February 10, 2020 / 01:49 AM IST

దశాబ్ధాలుగా క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఆ దేశం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క కప్ కూడా అందలేదు. అయితే అండర్‌-19 ప్రపంచకప్‌లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్‌ టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌కి ప్రపంచకప్ దక్కింది. చివర్లో వర్షం ఆటకు కాసేపు అంతరాయం కలిగించగా.. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆటను 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ 43పరుగులతో అజేయంగా నిలిచి అండర్‌-19 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. 

భారత్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌ టాప్, మిడిల్ ఆర్డర్‌‌ను బిష్ణోయ్ గట్టి దెబ్బే కొట్టాడు. తొలి నలుగురు బ్యాట్స్‌మెన్‌ను అతడు ఔట్ చేశాడు. సుశాంత్ మిశ్ర మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆ దశలో భారత్‌లో ఆశలు చిగురించినా కెప్టెన్ అక్బర్ నిలదొక్కుకొని జాగ్రత్తగా ఆడడంతో భారత్ ఓటమిపాలైంది. 

రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన బంగ్లా ఓపెనర్ పర్వేజ్ (47) చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును ఆదుకోవడం.. అక్బర్ అలీ (43 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఓ దశలో 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. అతడు ఔటయ్యే సమయానికి 143 పరుగులకు చేరుకుంది. అప్పటికి 32 ఓవర్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత బంగ్లా బ్యాట్స్‌మెన్ అక్బర్ అలీ, రకిబుల్ హసన్ (9) వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడి బంగ్లాను విజయానికి చేరువ చేశారు.

 అంతకుముందు బంగ్లాదేశ్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అవిషేక్ దాస్ మూడు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం, హసన్ షకీబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో టార్గెట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైశ్వాల్‌ 88 పరుగులతో మరోసారి రాణించగా, తిలక్‌ వర్మ 38, దృవ్‌ జూరెల్‌ 22 పరుగులు చేశారు.