BCCI Boycotts India vs Pakistan Asia Cup Game Report
BCCI : ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను ఆడొద్దని ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఐసీసీ, ఏసీసీ నిబంధన మేరకు ఆడుతున్నామని బీసీసీఐ చెప్పినప్పటికి ఫ్యాన్స్‌లో ఏ మాత్రం ఆగ్రహం తగ్గడం లేదు. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దుబాయ్ వేదికగా జరగనున్న భారత్, పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ పెద్దలు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ బీసీసీఐ అధికారి కూడా దుబాయ్ చేరుకోలేదట. మ్యాచ్ రోజున కేవలం ఒకే ఒక్క ప్రతినిధిని బీసీసీఐ తరుపున పంపనున్నట్లు సదరు వార్తల సారాంశం.
ఛాంపియన్స్ ట్రోఫీలో అలా..
ఈ ఏడాది యూఏఈ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరిగింది. నాటి టోర్నీలోనూ భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ ను పెద్ద సంఖ్యలో బీసీసీఐ అధికారులు మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అనేక రాష్ట్ర క్రికెట్ బోర్డు ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాత్రం లేదు. బాయ్‌కాట్ క్యాంపెయిన్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సభ్యుడిగా రాజీవ్ శుక్లా మ్యాచ్‌కు హాజరుకావచ్చని నివేదిక తెలిపింది. అయితే.. ఐసీసీ ఛైర్మన్ జై షా లేదా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హాజరయ్యే అవకాశం కూడా లేకపోలేదని స్పష్టం చేసింది.
ఫేవరెట్‌గా టీమ్ఇండియా..
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ వంటి బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ యూఏఈతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో కూడిన బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు పాక్ అనిశ్చితికి మారుపేరు. ఏ రోజు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేము. అదే సమయంలో టీ20 ఫార్మాట్‌లో ఆ రోజు కలిసివచ్చిన జట్టు విజేతగా నిలుస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఏదీ ఏమైనప్పటికి భారత్, పాక్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.