BCCI: బీసీసీఐ ఆ ఇద్దరికి బిగ్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. వారిద్దరి పై వేటు ఖాయం అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే.. భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ రియాన్ డస్కాటే. వీరిద్దరిని బీసీసీఐ తిరిగి తీసుకునే యోచనలో లేనట్లు తెలుస్తోంది. ఆసియా కప్ తర్వాత కాంట్రాక్ట్ ముగియగానే పక్కన పెట్టనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ప్రదర్శనతో సంబంధం లేకుండా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించడం గొప్ప విషయమే. అయితే కోచింగ్ సిబ్బంది పనితీరుపై బీసీసీఐ సంతోషంగా లేదని తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్ లో ఫలితం డిసైడ్ కానుంది. ఒకవేళ అందులో ఇంగ్లాండ్ గెలిస్తే కనుక.. ఇది గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారతదేశం గెలవని మరో సిరీస్ అవుతుంది.
న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ (3-0), బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి (1-3).. దీనికి తోడు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రిటైర్మెంట్.. ఈ పరిణామాలు భారత జట్టుపై కొంత ఒత్తిడి పెంచాయి. ఈ క్రమంలో బౌలింగ్ కోచ్ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ రియాన్ డస్కాటేలపై వేటు పడనుందని సమాచారం. సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ తర్వాత వారిద్దరిని బీసీసీఐ పక్కన పెట్టనుందని తెలుస్తోంది. వారిద్దరి పనితీరు పట్ల బోర్డు అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ హోమ్ సీజన్‌లో ఉంటుంది. ఆసియా కప్ తర్వాత కోచింగ్ సిబ్బందిలో కొత్త మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.