BCCI Secretary Devajit Saikia Breaks Silence On Gautam Gambhir Criticism
Gautam Gambhir : ఇటీవల భారత జట్టు స్వదేశంలోనూ వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఓడిపోతుంది. ప్రత్యర్థులను స్పిన్ ఉచ్చులో బిగించాలని చూస్తూ తానే చిక్కుకుని ఓడిపోతూ ఉంటుంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా ఇలాగే ఓడిపోయింది.
ఈ క్రమంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిని ఆ పదవి తప్పించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటిపై బీసీసీఐ స్పందించింది. హెడ్ కోచ్ గంభీర్ పై పూర్తి విశ్వాసం ఉన్నట్లు వెల్లడించింది.
బీసీసీఐ అధ్యక్షుడు దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. సెలక్టర్లు, కోచింగ్ బృందం, ప్రధాన కోచ్, ప్లేయర్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉందన్నాడు. వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పుకొచ్చాడు. అందుకనే వారు రాణిస్తున్నారని తెలిపాడు. అయితే.. ఏదో ఒక మ్యాచ్‌లో ఓడిపోగానే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయని, కానీ వాటిని తాము పట్టించుకోమన్నాడు.
ఇక ఇదే టీమ్‌తో మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాం, ఆసియాకప్‌ను కైవసం చేసుకున్నాం. అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌ను సమం చేసుకున్న విషయాలను గుర్తు చేశాడు. రోహిత్, అశ్విన్, కోహ్లీ వంటి ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌తో ప్రస్తుతం సంధి దశ నెలకొందని, వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉందన్నాడు. కాబట్టి ప్రజలు కాస్త ఓపిక పట్టాల్సి ఉందన్నాడు. గౌహతి టెస్టులో మన జట్టు రాణిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.