BCCI
BCCI: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక సిరీసులను ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
భారత్ జట్టు కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే.. అదికూడా తటస్థ వేదికలపై పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ లు ఆడుతుంది. 2012-13లో నుంచి ఇప్పటి వరకు టీమిండియా పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టలేదు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘ఉగ్రదాడికి గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తాం. ఇప్పటికే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లను ఆడటం లేదు. మన్ముందూ ఆ జట్టుతో ఆడే ప్రసక్తే లేదని బలంగా చెబుతున్నాం. అయితే, ఐసీసీ ఈవెంట్ల విషయానికొచ్చే సరికి ఐసీసీని గౌరవిస్తూ తటస్థ వేదికలపై ఆడుతున్నాం’’ అని అన్నారు.
ఐసీసీ నిబంధనలు పాటించడం కోసమే తటస్థ వేదికల్లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ తన జట్టుకు అనుమతిస్తోంది. ప్రస్తుతం దేశంలో జరిగిన ఘటనపై ఐసీసీకి అవగాహన ఉందని అనుకుంటున్నాం.. అని రాజీవ్ శుక్లా అన్నారు.