BCCI will be covered in National Sports Governance Bill
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన సంస్థ. అయితే.. ఇక పై జాతీయ క్రీడా పాలన బిల్లు పరిధిలోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. బీసీసీఐ ప్రభుత్వ నిధులపై ఆధారపడనప్పటికి కూడా జాతీయ క్రీడా బోర్డు నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ క్రీడా బిల్లు చట్టంగా మారిన తరువాత అన్ని క్రీడా సమాఖ్యల (ఎన్‌ఎస్‌ఎఫ్)ల మాదిరిగానే బీసీసీఐ పని చేయాల్సి ఉంటుంది. ఇతర ఎన్‌ఎస్‌ఎఫ్ మాదిరిగానే స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అయితే.. ఏదైన వివాదాలు తలెత్తినప్పుడు మాత్రం జాతీయ క్రీడా ట్రైబ్యునల్ పరిధిలోకి వస్తుంది. అయితే.. ఈ బిల్లు ద్వారా ఎన్‌ఎస్‌ఎఫ్‌లపై ప్రభుత్వ నియంత్రణ ఉండదు. క్రీడా సమాఖ్యల సుపరిపాలనకు సహాయకారిగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
WCL 2025 : 41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడుతుండడంతో బీసీసీఐ తప్పనిసరి పరిస్థితుల్లో జాతీయ క్రీడా పాలన బిల్లు పరిధిలోకి రావాల్సి ఉంది.
వయో పరిమితి పెంపు..
కార్యనిర్వహక సభ్యుల గరిష్ట వయోపరిమితి 70 నుంచి 75 సంవత్సరాలకు పెరుగుతుంది. దీంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ కి వెసులుబాటు కలగనుంది. ఈ నెల 19న బిన్నీకి 70 ఏళ్లు నిండాయి. అయితే.. ప్రస్తుత బీసీసీఐ నియమావళి ప్రకారం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యవర్గ సభ్యులు పదవిలో కొనసాగేందుకు అనర్హులు.
పారదర్శకత..
సంస్థాగతంగా క్రీడా సమాఖ్యలను మరింత బలోపేతం చేసేందుకు జాతీయ క్రీడా పాలన బిల్లును తీసుకువస్తున్నారు. సకాలంలో ఎన్నికలను నిర్వహించడం, పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, అథ్లెట్ల సంక్షేమం, ఫిర్యాదులు తగ్గించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.