Asia Cup 2023 : ఫైన‌ల్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. భార‌త్‌కు స‌గం క‌ష్టాలు త‌ప్పిన‌ట్లే..!

సొంత గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఆసియా క‌ప్ (Asia Cup) 2023 టోర్నీలో విజేత‌గా నిల‌వాల‌ని శ్రీలంక (Sri Lanka) భావిస్తోంది. సూప‌ర్‌-4 ద‌శ‌లో పాకిస్తాన్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్లు తేడాతో గెలిచి ఫైన‌ల్ చేరుకున్న లంక‌కు భారీ షాక్ త‌గిలింది.

Maheesh Theekshana

Asia Cup 2023 Final : సొంత గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఆసియా క‌ప్ (Asia Cup) 2023 టోర్నీలో విజేత‌గా నిల‌వాల‌ని శ్రీలంక (Sri Lanka) భావిస్తోంది. సూప‌ర్‌-4 ద‌శ‌లో పాకిస్తాన్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఫైన‌ల్ చేరుకున్న లంక‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ మ‌హీశ్ తీక్ష‌ణ భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. అత‌డి స్థానంలో సహన్ అరాచ్చిగే జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

పాకిస్తాన్‌తో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో మ‌హీశ్ తీక్ష‌ణ తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో ప‌లుమార్లు అత‌డు గ్రౌండ్ బ‌య‌ట‌కు వెళ్లాడు. నొప్పిని భ‌రిస్తూనే 9 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 42 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. మ్యాచ్ పూర్తి అయిన అనంత‌రం అత‌డికి స్కానింగ్ ను నిర్వ‌హించారు. గాయం తీవ్ర‌మైన‌దిగా రిపోర్టులో తేలింది. దీంతో అత‌డు ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డిని హై ప‌ర్ఫామెన్స్ సెంట‌ర్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు లంక బోర్డు తెలిపింది.

స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబోలోని ప్రేమదాస మైదానంలోనే ఆదివారం టీమ్ఇండియాతో ఫైనల్‌లో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సమయంలో కీలక స్పిన్నర్‌ అయిన తీక్షణ గాయపడటం లంక జ‌ట్టుకు పెద్ద షాక్ అని చెప్ప‌వ‌చ్చు. ఆసియా కప్‌ 2023లో తీక్ష‌ణ‌ 8 వికెట్లు తీశాడు. ఈ ఏడాది శ్రీలంక త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడు అత‌డే కావ‌డం గ‌మ‌నార్హం. 15 మ్యాచుల్లో 31 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Asia Cup 2023 : ఓట‌ముల చుట్టూ ప‌రిభ్ర‌మించిన విజ‌యం..!

అయితే.. తీక్ష‌ణ ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు కోలుకుంటాడా లేదా అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అంటున్నారు. అత‌డు కోలుకోకుంటే భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక క‌ష్టాలు ఎదుర్కోక త‌ప్ప‌దు. అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆరంభం కానుంది. శ్రీలంక జ‌ట్టు సెప్టెంబ‌ర్ 29న బంగ్లాదేశ్‌, అక్టోబ‌ర్ 3న అఫ్గానిస్తాన్‌తో మ్యాచులు ఆడ‌నుంది. ఇక మెగా టోర్నీలో లంక‌ త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 7న ద‌క్షిణాఫ్రికాతో ఆడ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు