Blow For BCCI As Cricket South Africa Takes Tough Stance On IPL 2025 Extension
ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-25) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు దేశాల క్రికెట్ బోర్డులు తమ, తమ జట్లను ప్రకటించాయి. అయితే.. ఇప్పుడు ఇదే ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు పెద్ద తలనొప్పిగా మారింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ మే 25 న జరగాల్సి ఉంది. అయితే.. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు ఐపీఎల్‌ను వాయిదా వేశారు. శనివారం మే 17 నుంచి టోర్నీ పునఃప్రారంభం కానుంది. జూన్ 3 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే.. డబ్ల్యూటీసీలో ఆడే తమ ఆటగాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ మే26 లోగా స్వదేశానికి తిరిగి రావాలని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది.
ముందుగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం మే25 న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగుస్తుంది. మే 26న విదేశీ ఆటగాళ్లను బీసీసీఐ విడుదల చేయాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్.. క్లారిటీ ఇచ్చిన షమీ..
దీనిపై దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ.. ఐపీఎల్, బీసీసీఐతో ప్రాథమిక ఒప్పందం ప్రకారం ఫైనల్ 25న జరగాలని, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 26న తిరిగి రావాలన్నారు ఆ తరువాత తాము 30న బయలుదేరే ముందు ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునేందుకు తగిన సమయం లభిస్తుందన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ పొడిగించినప్పటికి ఈ విషయంలో మా వైపు నుంచి ఎటువంటి మార్పు లేదన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
క్రికెట్ డైరెక్టర్, ఫోలేట్సి మోసెక్ వంటి సీనియర్ అధికారులు ఈ చర్చలు జరుపుతున్నారని తెలిపాడు. ఈ విషయం పై వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు. మే 26న మా ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి రావాలని తాము కోరుకుంటున్నాము అని శుక్రి కాన్రాడ్ తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన 15 మంది సభ్యులు గల జట్టులో.. 8 మంది ఐపీఎల్ ఆడుతున్నారు. ర్యాన్ రికెల్‌టన్ (ముంబై ఇండియన్స్), కార్బిన్ బాస్ (ముంబై ఇండియన్స్), లుంగి ఎంగిడి (ఆర్సీబీ), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), మార్కో యాన్సెన్ (పంజాబ్ కింగ్స్), ఐడెన్ మార్క్‌రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), వియాన్ ముల్డర్ (సన్ రైజర్స్ హైదరాబాద్) వంటి ఆటగాళ్లు ఉన్నారు.
మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయంలో ఆటగాళ్లకు స్వేచ్ఛ నిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలా వద్దా అనేది వారే నిర్ణంచుకోవాలని తెలిపింది. ఈ విషయంలో ఆటగాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మద్దతుగా ఉంటామని చెప్పింది.