Champions Trophy squad 2025 No place for Siraj
ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన జట్లలో మార్పులు, చేర్పులకు ఐసీసీ ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను తీసుకుంది. మరోవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని 15 మంది సభ్యులు గల జట్టులో చేర్చింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ సందర్భంగా బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. అతడు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసినప్పటికి ఛాంపియన్స్ ట్రోఫీకి తొలుత ప్రకటించిన జట్టులో అతడికి చోటు ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా కోలుకుంటాడని భావిస్తున్నట్లు అప్పట్లో సెలక్టర్లు చెప్పారు. బుమ్రా ఫిట్‌గా లేకపోతే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు.
IND vs ENG : ’50’లో 100.. అహ్మదాబాద్ వన్డేలో శుభ్‌మన్ గిల్ రికార్డులు ఇవే..
అయితే.. సిరాజ్ ను కాదని యువ పేసర్ హర్షిత్ రాణాను తీసుకున్నారు. నాన్ ట్రావెల్ రిజర్వ్‌గా సిరాజ్‌ను ఎంపిక చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీనియర్ పేసర్‌ను తీసుకోకుండా జూనియర్‌ను తీసుకోవడం పెద్ద రిస్క్ అని అంటున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గంభీర్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహించిన కేకేఆర్ ప్లేయర్స్‌ను మాత్రమే సెలక్ట్ చేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
2019లో వన్డేల్లో అరంగ్రేటం చేసిన సిరాజ్ ఇప్పటి వరకు 44 వన్డేల్లో ఆడాడు. 71 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 6/21. ఇక అదే హర్షిత్ రాణా విషయానికి వస్తే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోనే అరంగ్రేటం చేశాడు. తొలి వన్డేలో మూడు వికెట్లు తీయగా రెండో వన్డేలో ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. పైగా అతడికి దుబాయ్‌లో ఆడిన అనుభవం సైతం లేదు. ఈ క్రమంలో బుమ్రా స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని పలువురు మాజీ ఆటగాళ్లు సైతం అంటున్నారు.
జట్టులో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా అని మండిపడుతున్నారు. ఓ స్పిన్నర్‌కు బదులు సిరాజ్‌ను తీసుకుంటే సరిపోయేది చెబుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా.