Virat Kohli- Adil Rashid : వార్నీ కోహ్లీ వికెట్ తీయడం అంటే ఇంత ఇష్టమా ఆదిల్ రషీద్ నీకు.. అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా..
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్లు ఎవరో తెలుసా?

IND vs ENG 3rd ODI Adil Rashid dismisses kohli for 11th time in International cricket
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరు చెబితే చాలు బౌలర్లు భయపడిపోతుంటారు. తనదైన బ్యాటింగ్‌తో ఎందరో బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. అంతర్జాతీయ స్థాయి బౌలర్లు అయినా సరే తమ కెరీర్‌లో కోహ్లీని ఒక్కసారి అయినా ఔట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు అనడంతో అతి శయోక్తి కాదేమో.
అంతలా బౌలర్లకు చుక్కలు చూపించే కోహ్లీ.. కొందరు బౌలర్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. పదే పదే వారి బౌలింగ్‌లోనే ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకుంటున్నాడు.
ఒక్కసారి కాదు పదే పదే కోహ్లీని ఔట్ చేస్తున్న బౌలర్లలో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఒకడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీని ఆదిల్ మరోసారి ఔట్ చేశాడు.
దీంతో కలిపి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 11వ సారి కోహ్లీని ఔట్ చేశాడు ఆదిల్. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు కోహ్లీని ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. వన్డేల్లో ఐదు సార్లు, టెస్టుల్లో నాలుగు, టీ20ల్లో రెండు సార్లు కోహ్లీని ఔట్ చేశాడు రషీద్.
ఇక న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్‌లు సైతం అంతర్జాతీయ క్రికెట్‌లో చెరో 11 సార్లు కోహ్లీని ఔట్ చేశారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు కోహ్లీని ఔట్ చేసిన బౌలర్లు..
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) – 37 మ్యాచ్‌ల్లో 11 సార్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 29 మ్యాచ్‌ల్లో 11 సార్లు
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 34 మ్యాచ్‌ల్లో 11 సార్లు
మోయిన్ అలీ (ఇంగ్లాండ్) – 41 మ్యాచ్‌ల్లో 10 సార్లు
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్) – 37 మ్యాచ్‌ల్లో 10 సార్లు
చాలా కాలం తరువాత కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 55 బంతులు ఆడి 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు సాధించాడు.