Concussion Substitute Harshit Rana Creates history to became first player in internation T20 debut
టీమ్ఇండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. శుక్రవారం పూణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ తుది జట్టులో లేకపోయినప్పటికి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అతడు ఎంట్రీ ఇవ్వడం పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కంకషన్ సబ్ విషయంలో సరైన విధానం పాటించలేదని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ విషయాలను కాస్త పక్క బెడితే.. హర్షిత్ రాణా అరుదైన ఘనత సాధించాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదండోయ్ ప్రపంచ క్రికెట్‌లో ఈ విధంగా పొట్టి ఫార్మాట్‌లో అరంగ్రేటం చేసిన మొదటి ఆటగాడిగా కూడా రికార్డులకు ఎక్కాడు.
క్రికెట్ చరిత్రలో టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటి వరకు ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగ్రేటం చేశారు. ఇప్పుడు హర్షిత్ రాణా ఎంట్రీ ఇవ్వడంతో ఏడో ఆటగాడిగా నిలిచాడు.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగ్రేటం చేసిన ఆటగాళ్లు వీరే..
బ్రియాన్ ముడ్జింగన్యామా (జింబాబ్వే) – శ్రీలంకపై 2020లో టెస్టు మ్యాచ్‌లో
నీల్ రాక్ (ఐర్లాండ్) – వెస్టిండీస్ పై 2022లో వన్డే మ్యాచ్‌లో
ఖయా జోండో (దక్షిణాఫ్రికా) – బంగ్లాదేశ్ పై 2022లో టెస్ట్ మ్యాచ్‌లో
మాట్ పార్కిన్సన్ (ఇంగ్లాండ్) – న్యూజిలాండ్ పై 2022లో టెస్ట్ మ్యాచ్‌లో
కమ్రాన్ గులామ్ (పాకిస్థాన్) – న్యూజిలాండ్ పై 2023లో వన్డే మ్యాచ్‌లో
బహిర్ షా (అఫ్గానిస్థాన్) – బంగ్లాదేశ్ పై 2023లో టెస్ట్ మ్యాచ్‌లో
హర్షిత్ రాణా (భారత్) – ఇంగ్లాంపై 2025లో టీ20 మ్యాచ్‌లో
అరంగ్రేటంలోనే అదుర్స్..
ఇక హర్షిత్ రాణా విషయానికి వస్తే.. అరంగ్రేట మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబె (53), హార్దిక్ పాండ్యా (53) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను జేమి ఓవర్టన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతి దూబె తలను బలంగా తాకింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడిని పరిశీలించగా అంతా బాగుందని చెప్పి బ్యాటింగ్ కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.
తలనొప్పిగా ఉండడంతో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. మ్యాచ్ రిఫరీ అనుమతితో దూబె స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన చేశాడు. రాణాతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (51; 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 2న) జరగనుంది.