Controversy Erupts Over HCA Acting President Daljeet Singh Nomination for BCCI AGM
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరోసారి వివాదం చెలరేగింది. పలువురు క్లబ్ సెక్రటరీలు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
బీసీసీఐ 95వ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం) ఈ నెల 28న ముంబైలో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లకు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు అందాయి. హెచ్‌సీఏ(HCA )కు కూడా ఈ ఆహ్వానం అందింది. ఈ క్రమంలో.. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా దల్జిత్ ఉండడం నిబంధనలకు విరుద్దం అంటూ పలువురు క్లబ్ సెక్రటరీలు బీసీసీఐకి లేఖలు రాశారు. అంతేకాదండోయ్.. దల్జిత్ పై సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
జగన్మోహన్ రావు అరెస్టు కావడంతో..
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఈ ఏడాది జూలై నెలలో సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ.. నకిలీ పత్రాలతో జగన్ మోహన్ రావు అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు గుర్తించింది.
అతడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది. ఈ పరిణాల నేపథ్యంలో జగన్మోహన్ రావును అధ్యక్షుడిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడి స్థానంలో దల్జిత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు.