కెప్టెన్ అవుట్: వన్డేలకు ముందు కివీస్‌కి భారీ షాక్

  • Publish Date - February 4, 2020 / 08:01 AM IST

న్యూజిలాండ్, టీమిండియా మధ్య టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడు వన్డే మ్యాచ్‌లకు ముందు మాత్రం టీమిండియాకు, కివీస్‌కు రెండు జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే మ్యాచులకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూరం అవగా.. ఇప్పుడు కివీస్‌ జట్టులో రెండు వన్డేలకు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం అయ్యారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఈ రెండు వన్డేలకు కివీస్ జట్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరిస్తాడని వెల్లడించింది.

విలియమ్సన్ స్థానాన్ని మార్క్ చాప్‌మెన్ భర్తీ చేయనున్నాట్లు స్పష్టం చేసింది. టీమిండియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడ్డాడు. ఎక్స్-రే రిపోర్ట్‌ను పరిశీలించిన వైద్యులు కంగారు పడాల్సింది ఏమీ లేదని, కానీ గాయం నుంచి త్వరగా కోలుకోవాలంటే కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించారు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా గాయం కారణంగా కివీస్‌తో జరగనున్న వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరం అయ్యారు.

ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ దూరం కావడం కాస్త షాక్ అనే చెప్పుకోవాలి.