×
Ad

MS Dhoni : ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కీలక ప్రకటన .. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 248 మ్యాచ్‌ల్లో ఆడాడు.. 4,865 పరుగులు చేశాడు. జట్టును తన కెప్టెన్సీలో ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023లో) అందించారు.

MS Dhoni

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ -2026 (IPL 2026) టోర్నీలో ఆడతారా..? లేదా..? అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తూనే వచ్చాయి. అయితే, ధోనీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగుతూ వస్తున్నారు. 2026లో జరిగే ఐపీఎల్ టోర్నీలో ధోనీ ఆడబోడని, టోర్నీకి ముందే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

ధోనీ ఫ్యాన్స్ ‌కు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నీలో (IPL 2026) మహేంద్ సింగ్ ధోనీ ఆడబోతున్నారని.. ఆయన తుది జట్టులో ఉంటారని సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఎండ్ కార్డు పడినట్లయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ -2026లో ఆడటానికి మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈ విషయాన్ని మాతో చెప్పారు. ధోనీ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ధోనీ యువతరానికి మార్గనిర్దేశం చేయడంలో కీలకం కానున్నారు. ధోనీ ఇప్పుడే రిటైర్ అవ్వరు.. అతడి ఆట ఇంకా ముగియలేదు’ అంటూ విశ్వనాథన్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఐపీఎల్ -2026 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మార్పిడి, ఆటగాళ్లను దక్కించుకోవడం తదితర విషయాలపై చర్చించడానికి వచ్చేవారం జరిగే సీఎస్కే సమావేశంలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా పాల్గొంటున్నట్లు విశ్వనాథన్ తెలిపారు.

సీఎస్కే కెప్టెన్ ఎవరు..?
రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు గాయం కావడంతో గతేడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోనీ నడిపించిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ -2026 సీజన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే సీజన్‌కు కూడా కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్‌కే అప్పగిస్తారా..? లేదంటే ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తాడా..? లేదంటే కొత్తవారికి జట్టు పగ్గాలు అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సిందే. అయితే, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారన్న చర్చ కూడా కొనసాగుతోంది.

గత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్ ఆ జట్టును వీడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 15వ తేదీ వరకు రిటెన్షన్ గడువు ముగియనుండడంతో ప్రస్తుతం సంజూ శాంసన్ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకవేళ సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళితే.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా.. లేదంటే రుతురాజ్ గైక్వాడ్‌నే కొనసాగిస్తారా అనే అంశంపై కూడా ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, ఈనెల 10, 11 తేదీల్లో జట్టు ప్రణాళికపై సీఎస్కే జట్టు యాజమాన్యం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మహేంద్ర సింగ్ ధోనీ 248 మ్యాచ్‌ల్లో ఆడాడు.. 4,865 పరుగులు చేశాడు. జట్టును తన కెప్టెన్సీలో ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023లో) అందించారు.