David Warner and Dean Elgar set for farewell Test
Warner – Elgar : కొన్ని గంటల్లో 2023వ సంవత్సరం పూర్తి కాబోతుంది. ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం 2024కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధం అవుతున్నారు. ఇందుకు క్రీడాకారులు మినహాయింపు ఏం కాదు. గతేడాది వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ సరికొత్తగా తమని తాము మలుచుకుంటూ తమ ఆటతీరును మరింత మెరుగుపరచుకునేందుకు సన్నద్దం అవుతుంటారు. ఇక ఫామ్‌లో ఉన్న వారు అయితే దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే.. 2024 జనవరిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారు. వారు ఎవరో కాదు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. వీరు ఇద్దరు కూడా కొత్త ఏడాది ప్రారంభమైన ఏడు రోజులకే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నారు. తమ ఆఖరి మ్యాచులో సెంచరీలు చేసి విజయంతో తమ టెస్టు కెరీర్‌ను ముగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తమ నిర్ణయాలను వీరిద్దరు వెల్లడించారు.
సిడ్నీ వేదికగా..
2011లో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు డేవిడ్ వార్నర్. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరుపున 111 టెస్టులు ఆడాడు. 44.59 సగటుతో 8695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు ద్విశతకాలు అతడి పేరిట ఉన్నాయి. స్వదేశంలో పాకిస్తాన్ జరిగే టెస్టు సిరీసే ఆఖరిదని ఇప్పటికే వార్నర్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఇప్పటికే రెండు టెస్టు మ్యాచుల్లో ఓడింది. సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచే వార్నర్‌కు టెస్టుల్లో ఆఖరి మ్యాచ్ కానుంది.
David Warner
మొదటి టెస్టు మ్యాచులో భారీ సెంచరీ చేసిన వార్నర్ రెండో టెస్టు మ్యాచులో విఫలం అయ్యాడు. ఈ క్రమంలో తన ఆఖరి మ్యాచులో అతడు ఎలా ఆడుతాడో అనేదానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సిరీస్ ఆస్ట్రేలియా సొంతం కావడంతో వార్నర్ పై ఎలాంటి ఒత్తడి లేదు. దీంతో చివరి మ్యాచులో శతకం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వన్డేలు, టీ20లు ఆడతానని వార్నర్ స్పష్టం చేశాడు.
కేప్‌టౌన్‌లో..
డీన్ ఎల్గర్ 2012లో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా తరుపున 85 టెస్టు మ్యాచులు ఆడాడు. 38.4 సగటుతో 5,331 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. భారత్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులోనూ 185 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇదే ఊపులో కేప్‌టౌన్‌లో టీమ్ఇండియాతో జరగనున్న రెండో టెస్టులోనూ సెంచరీ చేయాలని భావిస్తున్నాడు. ఎల్గర్ టెస్టులకే కాదు మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కే గుడ్ బై చెప్పనున్నాడు.
వీరిద్దరు ఆఖరి టెస్టు సిరీస్‌లో రాణించడంపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు వెంకటేష్ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని తెలుగులో ఒక సామెత ఉంది. రిటైర్మెంట్ ప్రకటించి ఆఖరి సీరీస్ ఆడుతున్న ప్లేయర్లు రెచ్చిపోయి ఆడటం ఇప్పటి ట్రెండ్. వన్ డే వాల్డ్ కప్ లో డికాక్, మొన్న పాక్ తో జరిగిన మొదటి టెస్ట్ లో వార్నర్, ఇప్పుడు మనతో డీన్ ఎల్గర్ అలానే రెచ్చిపోయి ఆడేస్తున్నారు. అంటూ వ్యాఖ్యానించాడు.
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని తెలుగులో ఒక సామెత ఉంది. రిటైర్మెంట్ ప్రకటించి ఆఖరి సీరీస్ ఆడుతున్న ప్లేయర్లు రెచ్చిపోయి ఆడటం ఇప్పటి ట్రెండ్. వన్ డే వాల్డ్ కప్ లో డికాక్, మొన్న పాక్ తో జరిగిన మొదటి టెస్ట్ లో వార్నర్, ఇప్పుడు మనతో డీన్ ఎల్గర్ అలానే రెచ్చిపోయి ఆడేస్తున్నారు. pic.twitter.com/K2Sag41QtP
— C.VENKATESH (@C4CRICVENKATESH) December 28, 2023