Deepti Sharma only two wickets away from creating history in T20s
Deepti Sharma : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా నేడు (మంగళవారం డిసెంబర్ 23) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma ) ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో దీప్తి రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ (పురుషుల, మహిళల) టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.
2016లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో దీప్తి శర్మ అరంగ్రేటం చేసింది. ఇప్పటి వరకు 130 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 81 ఇన్నింగ్స్‌ల్లో 23.4 సగటుతో 1100 పరుగులు చేసింది. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 148 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ ప్రదర్శన 4/10.
మహిళల క్రికెట్‌లో ఈ రికార్డు సాధించేందుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ మాత్రమే దగ్గరగా ఉంది. ఆమె 2173 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు తీసింది.
ఇక పురుషుల క్రికెట్ కు వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ ఆల్‌రౌండర్ కూడా టీ20ల్లో 1000 పరుగులకు పైగా సాధించడంతో పాటు 150 వికెట్లను పడగొట్టలేదు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడు తన కెరీర్‌లో 2551 పరుగులు చేయగా 149 వికెట్లు సాధించాడు. అయితే.. అతడు 2024లో బంగ్లాదేశ్ తరుపున చివరి టీ20 ఆడాడు.
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే అతడు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2వేల పరుగులకు పైగా చేశాడు కానీ 101 వికెట్లను మాత్రమే తీశాడు.
ఇదిలా ఉంటే.. తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు అదే జోష్‌లో రెండో టీ20 మ్యాచ్‌లనూ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. మరో వైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది.