Virat Kohli : కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం..! విరాట్ విన్యాసాలను ప్రత్యక్ష్యంగా చూడలేరు
ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ(Virat Kohli), రిషబ్ పంత్ వంటి టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
Karnataka deny fans entry at Chinnaswamy stadium for Kohli VHT return match
Virat Kohli : కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో దాదాపు ఏడు నెలల తరువాత ఓ మ్యాచ్ జరగనుంది. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 లో భాగంగా చిన్నస్వామి స్టేడియం తొమ్మిది లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య డిసెంబర్ 24న జరగనుంది.
ఇందులో ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ (Virat Kohli ), రిషబ్ పంత్ వంటి టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిని ప్రత్యక్ష్యంగా చూడొచ్చని భావించిన అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ కూడదని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
వాస్తవానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్‌లకు రెండు నుంచి మూడు వేల మంది ఫ్యాన్స్‌కు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కర్ణాటక ప్రభుత్వానికి నివేదించింది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
అప్పటి విషాదమే కారణం..
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విజేతగా నిలిచిన తరువాత ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఫ్యాన్స్ గాయపడ్డారు. ఈ ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లను నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఇటీవల కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
