Do you know Champions Trophy had a different name earlier
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ జట్టు ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తి అయ్యాయి. అయితే.. ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారో తెలుసా? మొదట్లో దీన్ని ఛాంపియన్స్ ట్రోఫీ అని పిలిచేవారు కాదు. అప్పట్లో ఈ టోర్నీని ఏమని పిలిచే వారో తెలుసా? ఈ టోర్నీలో ఏ జట్టు ఎన్ని సార్లు విజేతగా నిలిచింది వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్నో ఎడిషన్ అంటే?
1998లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రవేశపెట్టారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీని నిర్వహించాలని అప్పట్లో తీర్మానించారు. అనుకున్నట్లుగా 2006 వరకు ఈ టోర్నీ జరిగింది. అయితే.. టీ20లకు ఆదరణ పెరగడంతో టీ20 ప్రపంచకప్ ను నిర్వహించాలని ఐసీసీ భావించింది. దీంతో ఈ టోర్నీని 2006 నుంచి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే.. పస్తుతం ఎడిషన్ ఎనిమిది సంవత్సరాల తరువాత జరుగుతుండడం గమనార్హం. ఇది తొమ్మిదో ఎడిషన్.
ఎక్కడ ప్రారంభించారు?
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో.. అత్యుత్తమ జట్లు అన్ని ఒకే టైటిల్ కోసం పోటీ పడేలా ఓ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీకి బీజం పడింది. 1998లో బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా ఈ టోర్ని మొదటి ఎడిషన్‌ను నిర్వహించారు. అప్పుడు ఈ టోర్నీని “ఇంటర్నేషన్ కప్” అని పిలిచేవారు. ప్రతి మ్యాచ్ సైతం డూ ఆర్ డై లాగా ఉండేది. నాకౌట్ ఫార్మాట్‌లో నిర్వహించారు. తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో వెస్టిండీస్‌ను ఓడించి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది.
2000లో నిర్వహించిన రెండో ఎడిషన్ కు కెన్యా ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ఈ టోర్నీ పేరును మార్చారు. ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచారు. మొత్తం 11 జట్లు పోటీపడ్డాయి. టీమ్ఇండియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇక 2002లో మరోసారి ఈ మెగాటోర్నీ పేరు మార్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ అనే పేరు వచ్చింది. అంతేకాదండోయ్ జట్ల సంఖ్య 12కి పెరిగింది. మూడో ఎడిషన్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత్, శ్రీలంకలు సంయుక్త విజేతలుగా నిలిచాయి.
WPL 2025 : నేటి నుంచే డబ్ల్యూపీఎల్.. మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
2006లో ఛాంపియన్స్ ట్రోఫీలో జట్ల సంఖ్య 10గా ఉండగా.. 2009లో అది ఎనిమిదికి తగ్గించారు. అప్పటి నుంచి ఎనిమిది జట్లతోనే ఛాంపియన్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. 2017లో చివరి సారి ఈ టోర్నీ జరిగింది. ఆ తరువాత టోర్నీని నిలిపివేశారు. అయితే.. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ పునరుద్దరించారు.
ర్యాంకింగ్స్ ఆధారంగా..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాయి. 2025లో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం ఎనిమిది జట్లను.. భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ పాయింట్ల పట్టిక ఆధారంగా నిర్ణయించారు. శ్రీలంక తొమ్మిదో స్థానంలో నిలవడంతో ఈ మెగా టోర్నీలో ఆడడం లేదు.
ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు వీరే..
– దక్షిణాఫ్రికా (1998లో)
– న్యూజిలాండ్ (2000లో)
– భారత్, శ్రీలంక (2002లో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో)
– వెస్టిండీస్ (2004లో)
– ఆస్ట్రేలియా (2006లో)
– ఆస్ట్రేలియా (2009లో)
– భారత్ (2013లో)
– పాకిస్థాన్ (2017లో)
భారత్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచాయి.