Do you know how many times Asia cup in T20 format
T20 Asia Cup : యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో ఈ సారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో (T20 Asia Cup) నిర్వహించనున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ను నిర్వహించడం ఇది మూడోసారి మాత్రమే. 2016, 2022లో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు.
ఆసియా కప్ 2016కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వగా, ఆసియా కప్ 2022కు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి కూడా యూఏఈనే ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రెండు సార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌లలో ఎవరు విజేతలుగా నిలిచారో ఓ సారి చూద్దాం.
2016లో భారత్..
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ ఆసియాకప్ 2016లో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఆ తరువాత పాక్ పై విజయం సాధించింది. అనంతరం శ్రీలంక, యూఏఈ లపై విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఆ తరువాత శిఖర్ ధావన్ (60), విరాట్ కోహ్లీ (41 నాటౌట్), ఎంఎస్ ధోని (20 నాటౌట్) లు రాణించడంతో లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.
Rohit Sharma : అభిమానుల పై రోహిత్ శర్మ అసహనం.. వినాయకుడి ముందు.. నా పేరు ఎందుకు?
2022లో శ్రీలంక..
చివరిసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్ 2022ను శ్రీలంక జట్టు గెలుచుకుంది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక అసాధారణంగా ఆడింది. సూపర్ ఫోర్‌లో భారత్‌ను ఓడించిన లంక జట్టు ఫైనల్‌లో పాక్‌తో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే పరిమితమైంది. దీంతో లంక జట్టు 23 పరుగుల తేడాతో గెలుపొందింది.