Do you know Hyderabad glorious football legacy
జుబైర్ ఖాన్, మహ్మద్ అక్బర్, షబ్బీర్ అలీ, మహ్మద్ హబీబ్, ఫరీద్, లతీఫుద్దీన్ నజాం.. వీరంతా ఎవరు అని మన హైదరాబాద్ వాళ్లుని అడిగితే చెప్పడం కష్టమే. అయితే.. ఇదే విషయాన్ని కోల్‌కతా వాసులను అడిగితే మాత్రం ఫుట్‌బాల్ స్టార్స్ అని ఠక్కున చెబుతారు. ఇందులో వింత ఏముంది.. కోల్‌కతాలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది అంటారా? అక్కడికే వస్తున్నాం ఆగండి. పైన చెప్పిన వారు ఏ ప్రాంతానికో చెందిన వాళ్లో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్లంతా హైదరాబాద్ వాసులే. ఇది నిజంగా నిజం అండి బాబు.
ఇప్పుడంటే హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు పెద్దగా క్రేజ్ లేదు గానీ ఒకప్పుడు భారత జట్టుకు ఫుట్‌బాలర్లను అందించే కార్ఖానాగా హైదరాబాద్ వెలుగొందింది అంటే మీరు నమ్ముతారా. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన 1956 ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.
ఇప్పటి వరకు కూడా భారత ఫుట్‌బాల్ చరిత్రలో విశ్వక్రీడల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. నాటి జట్టులో ఏకంగా ఎనిమిది మంది.. (ఎస్.కె.అజీజుద్దీన్, నూర్ మహ్మద్, తులసీదాస్ బలరాం, పీటర్ తంగరాజ్, ఎస్.ఎ.సలాం, ఎస్.ఎ.లతీఫ్, హామిద్ హుస్సేన్, జుబేర్ ఖాన్) హైదరాబాద్ ప్లేయర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ జట్టుకు కోచ్‌గా (అబ్దుల్ రహీం)ఉన్నది హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.
ఒకప్పుడు హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు యమా క్రేజ్ ఉండేది. 1960లలో సంగతి ఇది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం అప్పటి లాల్‌బాగ్ మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగేవి. ఈ మ్యాచ్‌లకు ఎంత క్రేజ్ అంటే.. ఈ స్టేడియం పై కప్పుల మీద కూర్చోని మరీ మ్యాచ్‌లు చూసేవాళ్లని చెబితే చాలా మంది నమ్మకపోవచ్చు.
అప్పట్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ పోలీస్ జట్టు ఒక్కటే ఉండేది. లీగ్‌లు ఉండేవి కాదు. అదే సమయంలో కోల్‌కతాలో క్లబ్ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో ఫుట్‌బాల్ ప్లేయర్లు కోల్‌కతా బాట పట్టారు. మహ్మడాన్ స్పోర్టింగ్ క్లబ్ (ఎంఎస్‌సీ), మోహన్ బగాన్ క్లబ్ (ఎంబీసీ), ఈస్ట్ బెంగాల్ క్లబ్ (ఈబీసీ), బెంగాల్ తరఫున ఆడారు. ఈ క్రమంలోనే 1970ల నుంచి భారత ఫుట్‌బాల్‌కు బెంగాల్ కేంద్రంగా మారిపోయింది.
అబ్దుల్ సలాం (మహ్మడాన్), తంగరాజ్ (బెంగాల్), బలరాం (బెంగాల్), కన్నన్ (ఈస్ట్ బెంగాల్), జాన్ విక్టర్ (మహ్మడాన్, ఈస్ట్ బెంగాల్, బెంగాల్), నయీముద్దీన్ (మహ్మడాన్, ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్) వంటి వాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్టాయిలో ఓ వెలుగు వెగిలిన హైదరాబాద్ ఆటగాళ్లు. ఇక 1950 నుంచి 1962 వరకు భారత్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన ఎస్.ఎ.రహీం ఎంతోమంది నాణ్యమైన ఫుట్‌బాలర్లను దేశానికి అందించాడు.
IND vs SA : మీరేమైనా అనుకోండి.. ఆ ఇద్దరు తోపు ప్లేయర్లు.. ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడండి..
దిగ్గజ హైదరాబాద్ ఫుట్‌బాల్ స్టార్లు వీరే..
* మహ్మద్ సలీం (1936 బెర్లిన్ ఒలింపిక్స్)
* సయ్యద్ అబ్దుల్ రహీం (కోచ్ 1956 ఒలింపిక్స్ నాలుగో స్థానం, 1951,1962 ఆసియా క్రీడల్లో స్వర్ణాలు)
* జుబైర్ ఖాన్ (1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్)
* హామిద్ హుస్సేన్ (1956, 1960 ఒలింపిక్స్, 1964 ఆసియా కప్ రన్నరప్)
* పీటర్ తంగరాజ్ (1956, 1960 ఒలింపిక్స్, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం)
* తులసీదాస్ బలరాం (1956, 1960 ఒలింపిక్స్, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం)
* ఎస్.కె.అజీజుద్దీన్ (1956 ఒలింపిక్స్)
* ధర్మలింగం కన్నన్ (1960 రోమ్ ఒలింపిక్స్)
* ఎస్.ఎ.హకీం (1960 రోమ్ ఒలింపిక్స్)
* జుల్ఫికరుద్దీన్ షేక్ (1960 రోమ్ ఒలింపిక్స్)
* షబ్బీర్ అలీ (1979 ఆసియా కప్ కెప్టెన్, ఫాస్టెస్ట్ హ్యాట్రిక్ రికార్డ్)
* మహ్మద్ హబీబ్ (1970-80ల్లో భారత స్టార్ స్ట్రైకర్)
* విక్టర్ అమల్‌రాజ్ (భారత మాజీ కెప్టెన్)
* సయ్యద్ నయీముద్దీన్ (1964-71 భారత కెప్టెన్, మాజీ కోచ్)
* మహ్మద్ యూసుఫ్ (భారత మాజీ ఆటగాడు)