IND vs SA : మీరేమైనా అనుకోండి.. ఆ ఇద్దరు తోపు ప్లేయర్లు.. ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడండి..
ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs SA ) టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌లు ఘోరంగా విఫలం అయ్యారు.
IND vs SA Ryan ten Doeschate comments on Shubman Gil and Suryakumar Yadav form
IND vs SA : ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌లు ఘోరంగా విఫలం అయ్యారు. సూర్య 5 పరుగులు చేయగా గిల్ గోల్డెన్ డకౌట్ (ఆడిన తొలి బంతికే ) అయ్యాడు. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వీరి వైఫల్యం మిగిలిన బ్యాటర్ల పై ఒత్తిడి పెంచింది. ఫలితంగా భారత్ 162 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వాస్తవం చెప్పాలంటే గత కొంతకాలంగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వీరిద్దరు పేలవ ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ వరుసగా విఫలం అవుతుండడంతో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో రెండో టీ20 మ్యాచ్ అనంతరం వీరి ప్రస్తుత ఫామ్ పై టీమ్ఇండియా సహాయ కోచ్ ర్యాన్‌టెన్ డస్కాటే స్పందించాడు. వారి ఫామ్ పై ఆందోళన అవసరం లేదంటూ మద్దతుగా నిలిచాడు.
ఆస్ట్రేలియా పర్యటన చివరిలో గిల్ మనస్తత్వంలో మంచి మార్పులను గమనించినట్లు డస్కాటే తెలిపాడు. సఫారీ సిరీస్‌లో అతడు ఔట్ అయిన విధానం పట్ల తానేమి ఆందోళన చెందడం లేదన్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో పవర్ ప్లే లో ఆటగాళ్లను చాలా దూకుడుగా ఆడాలని తామే చెప్పామని తెలిపాడు.
తొలి టీ20కి ఆతిథ్యం ఇచ్చిన కటక్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాదు, అందుకనే ఆ మ్యాచ్‌లో గిల్ ప్రదర్శన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నాడు. ఇక రెండో టీ20 మ్యాచ్‌లో ఔటైన విధానం పై మాట్లాడుతూ.. బ్యాటర్లు ఫామ్‌లో లేనప్పుడు మంచి బంతులకు కూడా ఔట్ అవుతారన్నాడు.
ఇక సూర్యకుమార్ యాదవ్ విషయంలోనూ తాము ఇలాంటి దృక్ఫథంతోనే ఉన్నామన్నాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాడిపై భారీగా పరుగులు చేయాలనే ఒత్తిడి ఉంటుందన్నాడు. అతడు మంచి ప్లేయర్ అని, త్వరలోనే అతడు తన రిథమ్‌ను కనుగొంటాడని తెలిపాడు. తాము కెప్టెన్లు, నాణ్యమైన ఆటగాళ్లకు మద్దతు ఇస్తామన్నాడు. బయట నుంచి చూస్తే ఇది కాస్త ఆందోళన కరంగా కనిపిస్తుందని, అయినప్పటికి త్వరలోనే ఈ ఇద్దరు పుంజుకుంటారనే ఆశాభావన్ని డస్కాటే వ్యక్తం చేశాడు.
