ECB can face a hard situation if Pakistan refuses to play ICC T20 World Cup 2026
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీకి ప్రారంభానికి రెండు వారాల కంటే చాలా తక్కువ సమయమే ఉంది. అయినప్పటికి కూడా ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము ఈ టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెదిరిస్తోంది. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ శుక్రవారం లేదంటే సోమవారం నాటికి తమ నిర్ణయాన్ని చెబుతామని పీసీబీ తెలిపింది.
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థిక కష్టాలు కూడా పీసీబీని వెన్నంటుతాయి. అదే సమయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా దాదాపు 1327 కోట్లను నష్టపోనుందే వార్తలు వస్తున్నాయి.
పాక్ జట్టు గనుక టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే ఐసీసీ ఆ జట్టుపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ జట్టుపై నిషేదం విధించవచ్చు. ద్వైపాక్షిక క్రికెట్ నుంచి ఆ దేశాన్ని ఐసీసీ సస్పెండ్ చేయొచ్చు. అదే జరిగితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం తప్పేలా లేదు.
ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు పాక్ ?
షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాక్ జట్టు మూడు మ్యాచ్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడకుంటే అప్పుడు ఐసీసీ ఆ జట్టు పై నిషేదం విధిస్తే.. ఈ సిరీస్ సందిగ్ధంలో పడుతుంది.
TheiPaper నివేదిక ప్రకారం ఈ సిరీస్ రద్దు వల్ల ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దాదాపు 105 మిలియన్లు (భారత కరెన్సీలో సుమారు ₹1,327.49 కోట్లు) నష్టపోతుందని పేర్కొంది. ప్రసార హక్కులు, టికెట్ల అమ్మకాలు, ఇంకా చాలా విధాలుగా ఒక్కొ టెస్టుకు దాదాపు 35 మిలియన్లు చొప్పున ఈసీబీ నష్టపోతుందని తెలిపింది. దీంతో ఈ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పాక్ జట్టు స్థానంలో మరో జట్టును ఈసీబీ తీసుకువచ్చేందుకు ప్రయత్నించవచ్చు.అని తెలిపింది.