ENG vs IND 3rd Test Bumrah reveals reason behind no celebration after five wicket haul
లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో లార్డ్స్‌లోని హానర్స్ బోర్డుపై తన పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కాగా.. ఐదో వికెట్ పడగొట్టిన తరువాత బుమ్రా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. సాధారణంగా ఓ బౌలర్ ఐదు వికెట్లు తీసిన తరువాత సంబురాలు చేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం.
ఇక బుమ్రా ఎందుకు సంబరాలు చేసుకోలేదు అన్న ప్రశ్న సగటు క్రీడాభిమాని మదిలో మెదిలో ఉంటుంది. దీనికి రెండో రోజు మ్యాచ్ ముగిసిన తరువాత జస్‌ప్రీత్ బుమ్రా సమాధానం ఇచ్చాడు. వాస్తవానికి ఆ సమయంలో తాను బాగా అలసిపోయానని విలేకరుల సమావేశంలో బుమ్రా చెప్పుకొచ్చాడు. అందుకనే ఎక్కువగా ఆనందించలేకపోయానన్నాడు. మైదానంలో చాలా సేపు బౌలింగ్ చేయడంతో కొంత ఆలసటకు గురి అయినట్లుగా తెలిపాడు.
నిజం చెప్పాలంటే.. మైదానంలో ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు తన వయసు ఏమీ 21-22 ఏళ్లు కాదని చెప్పాడు. సాధారణంగా తనకు అలాంటివి ఇష్టం ఉండవు అని చెప్పుకొచ్చాడు. అయితే.. తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్లుగా తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్ తొలి రోజు 18 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ తీయగా రెండో రోజు 9 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 27 ఓవర్లు వేసిన అతడు 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో నలుగురు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. టెస్టుల్లో బుమ్రాకు ఇది 15వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన.
ఇక బుమ్రాతో పాటు నితీశ్‌కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్‌లు చెరో రెండు వికెట్లు తీయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ (104) శతక్కొట్టాడు. జేమీ స్మిత్ (51), బ్రైడాన్ కార్స్ (56)లు అర్థశతకాలు సాధించారు.
ENG vs IND : పది ఓవర్లకే ఆకృతి కోల్పోయిన డ్యూక్ బంతి.. మరింత పాత బాల్ ఇచ్చారన్న సిరాజ్..
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (53), రిషబ్ పంత్ (19) లు క్రీజులో ఉన్నారు. భారత బ్యాటర్లలో కరుణ్ నాయర్ (40) పర్వాలేదనిపించగా, యశస్వి జైస్వాల్ (13), శుభ్‌మన్ గిల్ (16)లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.