ENG vs IND 3rd test Sundar Confident Of Team India Win
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నలార్డ్స్ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత విజయానికి 90 ఓవర్లలో 135 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 6 వికెట్లు కావాలి. ఈ క్రమంలో ఇప్పటికే ఇంగ్లాండ్ సహాయ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ మైండ్ గేమ్స్ మొదలు పెట్టాడు. ఐదో రోజు తొలి గంటలోనే టీమ్ఇండియా 6 వికెట్లను పడగొట్టాలని తమ జట్టు బౌలర్లకు సూచించాడు. అయితే.. దీనికి భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పంచ్ ఇచ్చాడు.
తమ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందన్నాడు. తప్పకుండా లార్డ్స్‌లో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. ‘మనం కోరుకున్నట్లుగానే చాలా విషయాలు జరగాలని ఆశిస్తాము. ప్రతి రోజు అలాగే ఉండాలని అనుకుంటాము. మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఐదో రోజు పాజిటివ్ మైండ్ సెట్‌తోనే మైదానంలోకి దిగుతాం. ప్రతి ఒక్కరు విజయం కోసం పోరాడేవారే. లార్డ్స్‌లో గెలవడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.’ అని సుందర్ అన్నాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం పై మాట్లాడుతూ.. విదేశాల్లో రాణించడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందన్నాడు. ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయో అలాగే ప్రయత్నించి విజయవంతమైనట్లు తెలిపాడు.
ఇక మ్యాచ్ సాగుతున్న కొద్ది తన పాత్ర మారుతూ ఉంటుందన్నాడు. అందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని చెప్పాడు. ఇక ఇరు జట్లు దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాయి. విజయం కోసం పోరాడుతాం. అని సుందర్ తెలిపాడు.