గోల్డ్ మెడల్ గోమతి కథ వింటే కన్నీళ్లు ఆగవు : నాన్న పశువుల ఆహారం తిని.. నాకు అన్నం పెట్టేవాడు
నాకు చక్కటి పోషకాహారం అందించాలనే ఆలోచనతో ఆయన పశువుల కోసం తీసి ఉంచిన ఆహారాన్ని తిన్నాడు. ఆయన ఇప్పుడు బతికిలేరు. ఒకవేళ ఉన్నా.. అతని ఓ దేవుడిగా భావించేదాన్ని.

నాకు చక్కటి పోషకాహారం అందించాలనే ఆలోచనతో ఆయన పశువుల కోసం తీసి ఉంచిన ఆహారాన్ని తిన్నాడు. ఆయన ఇప్పుడు బతికిలేరు. ఒకవేళ ఉన్నా.. అతని ఓ దేవుడిగా భావించేదాన్ని.
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న గోమతి మరిముత్తు విజయం వెనుక ఉన్న కష్టం ఉంటే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తనకు పోషకాహారం అందించాలని తన తండ్రి పశువులకు పెట్టే ఆహారం తిన్నారట. ప్రతి దశలోనూ కష్టాలకు ఎదురీది కన్నీటిని దిగమింగి పోరాడిన గోమతి మరిముత్తు ఒలింపిక్స్‌లో పోటీ చేస్తానంటుంది. దీని కోసం ఎవరినైనా సాయం కావాలంటూ అభ్యర్థిస్తుంది.
ఖతర్‌లోని దోహా వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్.. తమిళనాడుకు చెందిన స్ప్రింటర్ గోమతి మరిముత్తు స్వర్ణాన్ని సాధించింది. చెన్నైకు చెందిన గోమతి సోమవారం జరిగిన మహిళల 800 మీటర్ల పరుగును రెండు నిమిషాల 2.70 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయం అనంతరం మీడియా సమావేశంలో గోమతి మరిముత్తు.. ఇలా తెలిపింది.
‘నేను స్వర్ణం సాధించగలనని ప్రగాడ విశ్వాసంతో పోటీలోకి దిగాను. నెలరోజుల పాటు క్యాంపుకు వెళ్లనప్పటికీ ఒంటరిగానే ప్రాక్టీస్ చేశాను. భారత ప్రభుత్వం సాయం చేయనప్పటికీ పోటీకి సిద్ధమయ్యాను. భారత కోచ్ భాటియా నాకు ఫోన్‌లో మెలకువలు నేర్పేవారు. ఇక ఆసియా అథ్లెట్ చాంపియన్ షిప్ గురించి చెప్తే 50మీటర్లు చేరుకునేవరకూ రెండో పొజిషన్‌లో ఉన్నా. ఆ తర్వాత వేగం పెంచి స్వర్ణం సాధించా. ఇందుకు చాలా శ్రమించా. ఈ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం సాధించిన మహిళ నేనేనని తెలిసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ వేదికల్లో పతకాలు సాధిస్తా’ అనే విశ్వాసం వ్యక్తం చేసింది.
‘చాంపియన్ షిప్‌కు సిద్ధమవుతోన్న సమయంలో నా తండ్రి (మరిముత్తు)నడిచి వచ్చేందుకు తన ఆరోగ్యం సహకరించలేదు. కానీ, ఉదయం 4:30కు బస్సు కోసం ఆయన నన్ను 4గంటలకే లేపేవారు. తల్లి ఆరోగ్యం బాగాలేక మంచానపడితే.. ఆహారంతో పాటు మిగిలిన ఇంటిపనంతా ఆయనే చేసేవారు. ఒక సమయంలో అయితే నా తండ్రి అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. అప్పుడు కూడా నాకు చక్కటి పోషకాహారం అందించాలనే ఆలోచనతో ఆయన పశువుల కోసం తీసి ఉంచిన ఆహారాన్ని తిన్నాడు. ఆయన ఇప్పుడు బతికిలేరు. ఒకవేళ ఉన్నా.. అతన్ని ఓ దేవుడిగా భావించేదాన్ని. మా నాన్న ఎప్పుడూ స్వర్ణం సాధించగలనని చెబుతుండేవారు’
‘తమిళనాడు ప్రభుత్వం సహకరిస్తే.. ఇంకా కఠినంగా ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ పతకం తెచ్చేందుకు కృషి చేస్తా. ఒలింపిక్స్ వెళ్లాలంటే సంవత్సరం సమయం ఉంది. గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తా. చాలా మంది క్రీడాకారులు తమ హక్కులను సరిగా వినియోగించుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. నాకున్న బలాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. పోటీ జరిగిన దోహా ప్రాంతంలోని తమిళులు ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా నాకు సాయం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నందుకు సంతోషం’ అని తెలియజేసింది.