Final team composition became a headache for India Ahead of fourth test against england
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉంది. జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే.. ఇప్పుడు టీమ్ఇండియాకు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడడని అంటున్నారు. అయితే.. కీలక మ్యాచ్ కావడంతో బుమ్రాను ఖచ్చితంగా ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. అదే సమయంలో పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం పలువురు చెబుతున్నారు. దీంతో స్పెషలిస్టు స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను భారత్ తుది జట్టులోకి తీసుకుంటుందా? లేదంటే వాషింగ్టన్ సుందర్, జడేజాతోనే ఆడుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ENGw vs INDw : భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్‌కు ఐసీసీ భారీ జరిమానా..
కుల్దీప్‌కు ఛాన్స్..!
ఇంగ్లాండ్ పర్యటనకు ఏకైక స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ వచ్చాడు. అయితే.. భారత్ ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడినప్పటికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆల్‌రౌండ్ కోటాలో రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్‌గా ఉన్నాడు. లార్డ్స్ టెస్టులో వాషింగ్టన్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక విదేశాల్లో జడేజాను జట్టు నుంచి తప్పించడం అన్న ఆలోచనలే ఉండదు. ప్రస్తుత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు కావడంతో పాటు లార్డ్స్‌లో జట్టును గెలిపించేందుకు జడ్డూ చేసిన పోరాటం అసమానం.
కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు ఇస్తే.. అతడి బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అతడు వేసే బంతులు.. ఏ బంతి ఎలా టర్న్ అవుతుందో ఇంగ్లీష్ బ్యాటర్లు అంచనా వేయడం కష్టమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మాంచెస్టర్ పిచ్ మూడో రోజు నుంచి ప్లాట్ గా మారి స్పిన్నర్లకు అనుకూలం అనే అంచనాలు ఉన్నాయి. దీంతో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. కుల్దీప్‌కు జట్టులో చోటు ఇస్తే.. సుందర్ పక్కన పెడతారా? లేదంటే బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా చూడాలి.
Luke Hollman : ఇదెక్కడి షాట్ రా అయ్యా.. దీనికి ఏం పేరు పెట్టాలో కాస్త చూసి చెప్పండి బాబులు..
కరుణ్ నాయర్ పై వేటు?
ఎనిమిదేళ్ల తరువాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడి 131 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో అతడి అత్యధిక స్కోరు 40 పరుగులు. దీంతో అతడిని తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకుంటే బాగుంటుందని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
దీంతో నాలుగో టెస్టులో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.