ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోవడం అంటే మాటలా? ఊహకు కూడా కష్టం అనిపించే నిర్ణయాలను తీసుకున్నాడు కాబట్టే ఎంఎస్ ధోనికి ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యేకమైన పేరు. భారత క్రికెట్ కెప్టెన్సీకి కొత్త గుర్తింపు ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని, భారత్‌కు మాత్రమే కాకుండా, ప్రపంచంలోని విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు.
ధోని వంటి కెప్టెన్, వికెట్ కీపర్ ఇద్దరూ ఇప్పటివరకు భారత్‌కు లేరు. చూడలేదు. ఇకపై చూడలేరేమో. ధోని ఏమి చేయగలడో అనేది ఎవరూ ఊహించలేరు. మైదానంలో తన నిర్ణయంతో ప్రత్యర్థి ఆటగాళ్లను మరియు మైదానంలో అభిమానులను అనేకసార్లు ఆశ్చర్యపరిచాడు.
2007 టీ20 ఫైనల్‌లో జోగిందర్ శర్మను చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయించడం అయినా.. ఆస్ట్రేలియా పర్యటనలో మిడిల్ సిరీస్‌లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవడం.. ధోని ఆకస్మిక నిర్ణయాలు ప్రజలను ఆశ్చర్యపోయేలా చేశాయి.
2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్:
2007లో ఒక యువ జట్టుతో ధోని టీ 20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అనుకోకుండా అప్పుడే ధోని ఆశ్చర్యపరిచాడు. మైదానంలో ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించేందుకు చివరి ఓవర్లో మిస్బా ఉల్ హక్ ఉండగా.. ఆల్ రౌండర్ జోగిందర్ శర్మకు బౌలింగ్ బాధ్యతను ఇచ్చాడు భారత కెప్టెన్. అంతే ప్రేక్షకుల ఊపిరి ఆగిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ గెలిచింది, ధోని నిర్ణయం సరైనదని నిరూపించబడింది.
మొత్తం జట్టుతో విలేకరుల సమావేశానికి:
భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, ధోనిల మధ్య విభేదాల వార్తలను టీవీ ఛానెల్‌లలో బాగా చూపించారు. 2009లో ఇంగ్లాండ్‌లో ఆడిన టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ధోని మొత్తం జట్టుతో మీడియా ముందుకు వచ్చాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.
2011 ప్రపంచ కప్ ఫైనల్లో యువరాజ్ కంటే ముందే బ్యాటింగ్‌కు:
2011లో యువరాజ్ సింగ్ కంటే ముందే మైదానంలోకి వచ్చి ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై ధోని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ధోని మైదానంలో ప్రమాదకర ఆటగాడు అని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ప్రయోగాలు చేయడమే కాకుండా సరైన నిర్ణయం అని నిరూపించాడు. 28ఏళ్ల తరువాత భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు.
2014 ఆస్ట్రేలియా పర్యటనలో మిడిల్ టెస్ట్ సిరీస్‌లో రిటైర్మెంట్:
తన కెరీర్ బాగా సాగుతున్నప్పుడు 2014 లో టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ధోని. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత నిస్వార్థ క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మిడిల్ సిరీస్‌లో టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ధోని అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోయారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడవ మ్యాచ్ ముగిసిన వెంటనే, అతను టెస్ట్‌లకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వైట్ జెర్సీలో భారతదేశం తరపున ఎప్పుడూ ఆడలేదు.
వన్డే, టి20 కెప్టెన్సీలను వదులుకోవడం:
2017 సంవత్సరంలో, ధో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీని ఇచ్చిన కెప్టెన్ అకస్మాత్తుగా కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 4 జనవరి 2017 న, టి 20, వన్డే కెప్టెన్సీలను వదులుకోవడానికి ధోని నిర్ణయించుకోవటం క్రికెట్ ప్రపంచంలో సంచలనం అయ్యింది.