Former Indian all rounder Syed Abid Ali passes away at 83
భారత మాజీ ఆల్ రౌండర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. 1967 నుంచి 1975 మధ్య కాలంలో ఆయన భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అబిద్ అలీ టీమ్ఇండియా తరుపున మొత్తం 29 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. మీడియం పేసర్, బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా మంచి ప్రదర్శన కనబరిచారు. 1967లో ఆస్ట్రేలియాలోని బ్రిస్పేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశారు.
Shubman Gill : ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న శుభ్‌మన్ గిల్..
తన తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. 55 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశారు. అదే సిరీస్‌లో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు.
తన టెస్టు కెరీర్‌లో 47 వికెట్లు తీయడంతో పాటు 1018 పరుగులు సాధించాడు. 32 క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక వన్డేల్లో 7 వికెట్లు తీయడంతో పాటు 93 పరుగులు చేశాడు.
అబిద్ అలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 212 మ్యాచ్‌ల్లో 8,732 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలతో పాటు 31 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 212. ఇక బౌలింగ్‌లో 397 వికెట్లు తీశాడు. 12 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 169 పరుగులు చేయడంతో పాటు 19 వికెట్లు సాధించాడు.
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అబిద్ అలీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కాలిఫోర్నియాలో క్రికెట్‌ను ప్రోత్సహించడంలో అబిద్ అలీ కీలక పాత్ర పోషించారని అతడి బంధువు రెజా ఖాన్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.